మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 23న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం శుక్రవారం నాడు ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లోని దక్షిణ అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది.ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6కి.మి ఎత్తు వరకూ స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది ఆ తరువాత క్రమంగా బలపడుతూ 23నాటికి తీవ్రవాయగుండంగా బలపడి తన దిశను మార్చుకునే అవకాశం ఉంది. ఇది పశ్చిమ ,మద్య బంగాళాఖాతంలో తుపానుగా ఏర్పడే అవకాశం ఉంది. క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరం వెంబడి కదులుతూ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరానికి ఈ నెల 25న చేరుకోనుంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.