మహబూబాబాద్ : గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను భుజాన వేసుకుని అంతా తానై తగిన ఏర్పాట్లను ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్మైన్ అంగోతు బిందు, కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఇతర శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్న స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు రూ. 50 కోట్ల ఎస్. డి. ఎఫ్ నిధులతో మానుకోట పట్టణంలో చేపట్టే పలు అభివృద్ది పనుల ఫైలాన్‌ను, పట్టణ నడిబోడ్డున రూ. 6. 05 కోట్లతో అత్యధునికంగా నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మోడల్ మార్కెట్‌ను, రామచంద్రాపురంలో నిర్మించిన 200 డబుల్ బెడ్ రూం ఇండ్లను, సభ జరిగే ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను మంత్రితో పాటు వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలను ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యవతి వెల్లడించారు. గురువారం మంత్రి కేటీఆర్ ఉదయం 10.30 గంటలకు మానుకోట జిల్లా కేంద్రానికి చేరుకుంటారని వివరించారు. తొలుత స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల పైలాన్‌ను ఆవిష్కస్తారని చెప్పారు.
అనంతరం మోడల్ మార్కెట్‌ను ప్రారంభించనున్నారన్నారు. అక్కడి నుంచి రామచంద్రాపురం కాలనీలో నిర్మించిన రెండు వందల డబుల్ రూం ఇళ్లను ప్రారంభిస్తారని పేర్కోన్నారు. అక్కడి నుంచి మానుకోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఈదులపూసపల్లి వరకు రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు విస్తరణ, రోడ్డు డివైడర్, సెంట్రట్ లైటింగ్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేపట్టనున్నారని వెల్లడించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభ వేదిక మీదుగా జిల్లాలోని పోడు భూముల పట్టాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీకి శ్రీకారం చుడతారని మంత్రి సత్యవతి పేర్కోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోడు భూములకు పట్టాల మహా యజ్ఙం అద్భుతంగా కొనసాగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఎందరో గిరిజనుల జీవితాల్లో వెలుగులను నింపబోతున్నామని అన్నారు.
పోడు భూముల హక్కు పత్రాలు పంపిణీ బృహత్తర కార్యక్రమంగా భావించాలన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు 2006 నుంచి 2009 వరకు 8560 మంది రైతులకు కేవలం 23 వేల ఎకరాలకు మాత్రమే అందించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనుల ఆశయాలకు పరిరక్షించే దిశగా శాశ్వత మన్నె భూ యజమాన్యులుగా హక్కు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాల పంపిణీతో గిరిజన జీవితాలను బాగు చేయాలని మహా యజ్ఙంగా చేపట్టి విజయం సాధించారన్నారు. లక్ష యాబై వేల మంది రైతులకు నాలుగు లక్షల ఆరు వేల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే గతంలో చేపట్టిన పంపిణీకి నాలుగింతలు సమానమని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ మహా యజ్ఙంలో ఈ నెల 30 గురువారం రోజున ఆసిఫాబాద్‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అద్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోడు భూములకు అటవీ హక్కు పత్రాలను పంపిణీ చేయనున్నారని అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అద్యక్షతన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు పోడు భూములకు పట్టాలను అందజేయనున్నారని మంత్రి వివరించారు.
మానుకోటలో మంత్రి కెటిఆర్‌చే పట్టాల పంపిణీ
అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తమ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటి పరిశ్రమలు, పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు గిరిజనులకు పోడు భూముల హక్కు పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. పోడు భూములకు హక్కు పత్రాలతో పాటు పెట్టుబడి సాయంగా రైతు బంధును కూడా వారికి అందించనున్నట్లు పేర్కోన్నారు. 350 కోట్లతో తీఫెస్ విద్యుత్ సౌకర్యాన్ని చేపట్టామన్నారు. మారుమూల ప్రాంతాలకు సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఒక్క సింగిల్ ఆవాసం కూడా విద్యుత్ కనెక్షన్ లేని గ్రామం ఉండకూడదని తమ ప్రధాన ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. రూ. వంద కోట్లతో గిరి వికాసం పథకం కింద సాగుకు యోగ్యంగా లేని ప్రాంతాలను గుర్తించి సాగునీరు, విద్యుత్తు, బోర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సిఎం కెసిఆర్ పాలన స్వర్ణ యుగం
తెలంగాణలో సీఎం కేసీఆర్ సుపరిపాలన స్వర్ణయుగంగా మంత్రి కీర్తించారు. గిరిజన హక్కులు కాపాడాలని ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకుని తెలంగాణలో అత్యధికంగా గిరిజనులు ఉన్నందున పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. 2017లో చెల్లప్ప కమిషన్ గిరిజనులకు ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్ ఇవాలని చెప్పడంతో సెప్టెంబర్‌లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆరు శాతం నుంచి 10 శాతం వరకు పెంచుకోగలిగామన్నారు. 500 మంది జనాభా ఉన్న గిరిజన తండాలను, గూడాలను గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా రాష్ట్రంలో 3,046 అవాసాలు, గిరిజన పంచాయితీలుగా ఏర్పడ్డాయని వాటి అభివృద్ది కోసం రూ. 600 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందన్నారు.
ఒక్కోక్క గ్రామపంచాయితీ భవనాన్ని రూ. 20 లక్షలతో నిర్మించతలపెట్టామని మంత్రి వివరించారు. 90 గిరిజన గురుకులాలు ఉండగా మరో 95 గురుకులాలను మంజూరు చేశామన్నారు. విద్యాప్రమాణాలను మరింతగా పెంచేందుకు ఇంగ్లీస్ మీడియం ప్రవేశపెట్టామని మంత్రి పేర్కోన్నారు. రూ. 500 కోట్లతో మానుకోట జిల్లా కేంద్రంలో కొత్తగా మెడికల్ కళాశాల, టీచింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు 138 డాక్టర్లను కేటాయించిదన్నారు. దీంతో కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు.
మంత్రి పర్యటన ఇలా..
మంత్రి కేటీర్ రోడ్డు మార్గం ద్వారా గురువారం ఉదయం 10.30 గంటలకు మానుకోటకు చేరుకుంటారని మంత్రి ప్రకటించారు. రూ. 50 కోట్ల ఎస్.డి.ఎఫ్ నిధులతో పట్టణంలో చేపట్టే అభివృద్ది పనుల పైలాన్‌ను మంత్రి తొలుత ఆవిష్కరిస్తారని పేర్కోన్నారు. ఆదే స్థానంలో రూ. ఒక కోటితో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభోత్సవ శిలాపలకాన్ని కూడా ఆవిష్కరిస్తారన్నారు. రూ. ఐదు కోట్లతో వివేకానందం రోడ్డు పనులకు శంకుస్తాపన, రూ. ఆరు కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన మోడల్ మార్కెట్‌ను ప్రారంభోత్సం, రామచంద్రాపురంలో రెండువందల డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వద్ద పదిహేను వేల మందితో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోడు భూముల పట్టాల పంపిణీ చేయనున్నారని వివరించారు. అలాగే పాత్రికేయుల ఇళ్ల స్థలాల పరిశీలన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నామని మంత్రి వివరించారు. ఇంకా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు బానోత్ రవికుమార్, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు చిట్యాల జనార్థన్, మున్సిపల్ కమీషనర్ కట్టంగూరు ప్రసన్నరాణి, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.