అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం
రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాలో గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా విపత్తు నిర్వహణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. పిడుగు పాటుతో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల రూపాయల చొప్పున అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
బాధిత కుటుంబాలకు ఈ పరిహారం త్వరితగతిన అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆరుగురికి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆరుగురికి, కొమరం భీం జిల్లాలో నలుగురికి, హనుమకొండ జిల్లాలో ముగ్గురికి, నారా యణపేట్, జోగులాంబ, మహబూబాబాద్, మెదక్ జిల్లాలో ఇద్దరికి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జనగాం, యాదాద్రి, పెద్దపల్లి, వరంగల్ , ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, కామారెడ్డి, నిర్మల్ , సూర్యాపేట జిల్లాలో ఒక్కోక్కరికి ఈ నష్టపరిహారం మంజూరయ్యిందని ఆయన తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్ర మాదంలో అసువులు బాసిన పది కుటుంబాలకు మనిషికి రూ. 4 లక్షల చొప్పున 40 లక్షల రూపాయిలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతోపాటు హైదరాబాద్‌లోని రుబీహోటల్ అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన 8 కుటుంబాలకు రూ. 32 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.