రాజ్‌నంద్‌గావ్(ఛత్తీస్‌గఢ్): భారీ వర్షంతోపాటు పిడుగులు పడడంతో ఐదుగురు బాలురతోసహా 8 మంది మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాకు చెందిన జోరతరై గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వర్షం పడుతుండడంతో రోడ్డు పక్కన ఉన్న ఒక కట్టడం కింద నిలబడి ఉన్న వారిపై పిడుగుపడినట్లు జిల్లా ఎస్‌పి మోహిత్ గర్గ్ తెలిపారు. పిడుగుపాటుకు గురైనవారిలో నలుగురు మైనర్ విద్యార్థులు ఉన్నారు. సమీపంలోని ముధపర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వీరంతా 11వ, 12వ తరగతి చదువుతున్నారు.
క్వార్టర్లీ పరీక్షలు రాసి సైకిళ్లపై ఇళ్లకు తిరిగి వెళుతుండగా హఠాత్తుగా వర్షం పడడంతో తడవకుండా ఉండేందుకు రోడ్డు పక్కన ఉన్న ఒక కట్టడం కిందకు చేరారని, వీరితోపాటు మరో నలుగురు వ్యక్తులు అక్కడ తలదాచుకున్నారని ఎస్‌పి చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నారు. పిడుగుపాటుకు మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.