Monday, January 20, 2025

గుజరాత్‌లో భారీ వర్షాలు… పిడుగులు పడి 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్ లోని మొత్తం 251 తాలూకాల్లో 220 చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగళ్లతోపాటు అనేక చోట్ల పిడుగులు పడడంతో గుజరాత్ రాష్ట్రంలో 20 మంది చనిపోయారు. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్, అమ్రేలి జిల్లాల్లో 16 గంటల్లో 50 మిల్లీమీటర్ల నుంచి 117 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో మృతుల వివరాలను స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జిల్లాల వారీగా మృతుల వివరాలను వెల్లడించింది. దాహోద్‌లో నలుగురు, బరూచ్‌లో ముగ్గురు, తాపీలో ఇద్దరు, అహ్మదాబాద్, అమ్రేలి, బనస్కాంత, బోటాడ్, ఖేదా, మెహసానా, పంచమహల్, సబర్‌కాంత, సూరత్, సురేంద్ర నగర్, దేవభూమి ద్వారక జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఈ ప్రాణనష్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన సంతాపాన్ని తెలియజేశారు.

స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో చురుకుగా నిమగ్నమైందని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, దేశం లోని పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంజాబ్ , హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాజస్థాన్, మహారాష్ట్ర లోనూ నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో గుజరాత్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News