Friday, December 20, 2024

హైదరాబాద్ లో వెలుగులు… అమరావతి వెలవెల: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయిందని, కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని ఆయన విమర్శించారు. తిరువూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన కారణంగా అభివృద్ధి కుంటుపడిందని, ఒక తరం ఇంతగా నష్టపోయిన దాఖలా ప్రపంచంలో ఇంకెక్కడా లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారనీ, ధాన్యం రైతులు దగా పడ్డారని చెప్పారు. రాష్ట్ర రైతులు అప్పుల్లో మొదటిస్థానంలో ఉంటే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. సైతాన్ ప్రభుత్వం పోయి తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం వస్తేనే రైతుల బతుకులు బాగుపడతాయని చెప్పారు.

‘మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుంది. మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది’ అని చంద్రబాబు చెప్పారు. ‘రాష్ట్రంలో యువతను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతానన్నారు. ‘బాబు ష్యూరిటీ… భవితకు గ్యారెంటీ’ పేరిట సూపర్ సిక్స్ అందిస్తాం, ఐదేళ్లలో 20 లక్షలమందికి ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి ఇస్తాం. రైతులకు రూ. 20 వేలు అందిస్తాం. ప్రత్యేక బీసీ చట్టం తీసుకొస్తాం’ అని చంద్రబాబు వివరించారు.

ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్ గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు. పాతికేళ్ల క్రితం తాను యువతకు ఇచ్చిన ఆయుధం ఐటీ అన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రపంచమంతా సంఘీభావంగా నిలిచిందని చెప్పారు. తిరువూరులో జరిగిన ఈ బహిరంగ సభకు ఉమ్మడి కృష్ణాజిల్లాతోపాటు ఖమ్మం జిల్లానుంచి కూడా అభిమానులు పెద్దయెత్తున తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News