Friday, January 10, 2025

ఇది అన్యాయం, దుష్టులపై పోరు

- Advertisement -
- Advertisement -

బిజెపికి ఉద్వాసన పలకండి
హర్యానా ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ

చండీగఢ్ : ఈ నెల 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఉద్వాసన పలకవలసిందిగా ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం విజ్ఞప్తి చేశారు. ఇది దుష్టులు, అన్యాయం, అబద్ధాలపై పోరాటం అని ప్రియాంక పేర్కొన్నారు. హర్యానా జులానా నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి, ఒలింపిక్ మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ తరఫున ఒక బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. ఉపాధి కల్పన, అగ్నివీర్ మిలిటరీ నియామక పథకం, రైతుల సంక్షేమం తదితర సమస్యలపై రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రియాంక విరుచుకుపడుతూ, అధికార పార్టీ ప్రతి దశలోను ప్రజలకు ‘నయవంచన’ చేసిందని ఆరోపించారు.

‘కురుక్షేత్ర యుద్ధం, బ్రిటిష్‌వారిపై పోరాటం మాదిరిగా అవకాశం మళ్లీ వచ్చింది. తేడా ఏమీ లేదు’ అని ఆమె అన్నారు. ‘ఇప్పుడు ఇది అన్యాయం, అసత్యం, దుష్టులపై మీ పోరాటం. మీరు ధీమాగా నిలబడవలసి ఉంటుంది. మీరు ఆత్మావలోకనం చేసుకోవలసి ఉంటుంది, ఏమి జరుగుతోందో చూడవలసి ఉంటుంది’ అని ప్రియాంక సూచించారు. మోడీ ప్రభుత్వం కొద్ది మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనార్థమే పని చేస్తున్నదని ప్రియాంక ఆరోపిస్తూ, బిజెపి నేతృత్వంలోని కేంద్రం ‘సర్వాన్ని అంబానీకి, అదానీకి’ ఇచ్చినందున ఉద్యోగావకాశాలు కల్పించలేకపోతోందని విమర్శించారు, ‘అన్ని రేవులు, భూమి, పరిశ్రమలు, విమానాశ్రయాలను బడా పారిశ్రామికవేత్తల పరం చేశారు’ అని ఆమె అన్నారు. ఇప్పుడు చిన్న వాణిజ్య సంస్థలు, వ్యవసాయ రంగం నుంచి ఉద్యోవకాశాలు సృష్టించలేరని ఆమె పేర్కొన్నారు. ‘అది(బిజెపి ప్రభుత్వం) ఉపాధి కల్పన పని చేయజాలదు, ఎందుకంటే దాని విధానాలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి’ అని ప్రియాంక ఆరోపించారు.

అగ్నిపథ్ పథకం గురించి ప్రియాంక ప్రస్తావిస్తూ, అగ్నివీర్‌లకు ఎటువంటి పింఛనూ లభించదని, వారు నాలుగు సంవత్సరాల సర్వీస్ అనంతరం ఉద్యోగం కోసం మళ్లీ వెతుకులాడవలసి ఉంటుందని అన్నారు. ‘మీకు మోడీజీ ఇచ్చింది ఇదే’ అని ఆమె అన్నారు. ‘కుటుంబ పరిచయ పత్రం’ పథకంపై బిజెపి ప్రభుత్వాన్ని ప్రియాంక విమర్శిస్తూ, అది ప్రజలను ఎన్నో ఇబ్బందుల పాల్జేసిందని చెప్పారు. ‘మిమ్మల్ని పది సంవత్సరాలు తప్పుదోవ పట్టించారు. పది సంవత్సరాలుగా రైతులు, జవాన్లు, మల్లయోధులు, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు చూస్తున్నారు’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం రద్దు అయిన మూడు వ్యవసాయ చట్టాల గురించి ప్రియాంక ప్రస్తావిస్తూ, రైతాంగానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన నిరసనకారులైన రైతులను కలుసుకునేందుకు మోడీ ఐదు నిమిషాల పాటు అయినా బయటకు రాలేకపోయారు’ అని ప్రియాంక విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News