Sunday, November 24, 2024

భారత్‌కు బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత

- Advertisement -
- Advertisement -

Like Hanuman got Medicine: Bolsonaro

 

కొవిడ్ వ్యాక్సిన్లను ‘హనుమంతుడు తెచ్చిన సంజీవని’గా
అభివర్ణించే చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసిన బోల్స్‌నారో

రియో డీ జనిరో: భారత్ పంపిన కొవిషీల్డ్ టీకాలు శనివారం బ్రెజిల్‌కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ప్రత్యేక విమానం బ్రెజిల్‌కు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. భారత ఉదారతకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్స్‌నారో వినూత్న రీతిలో కృతజ్ఞతలుతెలిపారు. కొవిడ్ టీకాలను రామాయణంలో హనుమంతుడు తీసుకువచ్చిన సంజీవనితో పోల్చారు. ఈ మేరకు టీకాలను హనుమంతుడు బ్రెజిల్‌కు మోసుకెళ్తున్నట్లుగా ఉన్న ఒక చిత్రాన్ని ట్విట్టర్‌లో ఉంచారు.ఆ చిత్రంపై ‘ భారత్‌కు ధన్యవాదాలు’ అని హిందీ, ఇంగ్లీషుతో పాటుగా బ్రెజిల్ అధికారిక భాషలో రాశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి బోల్స్‌నారో కృతజ్ఞతలు తెలియజేశారు.‘ప్రధాని మోడీకి నమస్కారం. కరోనాపై బ్రెజిల్ చేస్తున్న పోరులో భారత్ వంటి భాగస్వామి దేశం భాగస్వామిగా చేరడం గౌరవంగా భావిస్తున్నాం. వ్యాక్సిన్లను పంపి మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని బోల్స్‌నారో ట్వీట్ చేశారు.

దీనికి మోడీ సైతం స్పందించారు. ‘కరోనాను అంతమొందించడంలో బ్రెజిల్ వంటి భాగస్వామ్య దేశంతో కలిసి పని చేయడం మేమూ గౌరవంగా భావిస్తున్నాం. వైద్యం, ఆరోగ్య సంరక్షణ విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాం’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బ్రెజిల్‌తో పాటుగా మొరాకోకు కూడా 20 లక్షల డోసులను భారత్ శుక్రవారం ప్రత్యేక విమానంలో పంపించింది. బుధవారంనుంచి భారత్ వివిధ దేశాలకు కొవిడ్ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రాతిపదికన సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మొరాకో, బంగ్లాదేశ్, మయన్మార్‌లకు కొవిడ్ టీకాల సరఫరా చేపడుతున్నట్లు శుక్రవారం విదేశాంగ శాఖ తెలియజేసింది. మరోవైను కొవిడ్ టీకాలను పంపించినందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News