- Advertisement -
మధ్యప్రదేశ్ సిఎంకు బిసి నేతల వినతి
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న మాదిరిగా విద్యా, ఉద్యోగ పథకాలను ముఖ్యంగా బిసిలకు ఫీజుల రియింబర్స్ మెంట్, హాస్టళ్ళు బిసి,ఎస్‌సి, ఎస్‌టిలకు గురుకుల పాఠశాల పథకాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రవేశ పెట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బిసి ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్ వచ్చిన మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. మధ్యప్రదేశ్ శాసనసభలో బిసి బిల్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. బిసి పోరాట ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 6వేల హస్తళ్ళులో 6 లక్షల మంది మూడవ తరగతి నుండి పిజి వరకు ఉచితంగా చదువుతున్నారని. 1500 గురుకుల పాఠశాలలో 9 లక్షల మంది కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలతో చదువుతున్నారని మధ్యప్రదేశ్ సిఎంకు వివరించారు.
ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్, పిజి, డిగ్రీ తదితర కాలేజీ కోర్సులు ఉచితంగా 30 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు. ఈ పథకాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. 16 బిసి డిమాండ్లను శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తెచ్చారు. ఈ డిమాండ్లపై మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై వత్తిడి తేవాలని కోరారు. పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బిసి ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బిసిల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతానికి పెంచాలని కోరారు.
పంచాయతీరాజ్ సంస్థలో బిసి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. బిసి.ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలన్నారు. బిసి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి చట్టాన్ని తేవాలని కోరారు. ప్రైవేటు రంగంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి.లకు రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెటాలని కోరారు. రాష్ట్రాలకు 80 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కేంధ్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్, బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఈ డిమాండ్లు న్యాయమైనవని వీటికి పార్టీ పరంగా పూర్తి మద్దతిస్తామని, ప్రధానమంత్రితో చర్చిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు.
బిసి నాయకులకు ఆహ్వానం
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిసి ఉద్యమం బలంగా ఉందని సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇక్కడ పథకాలను ముఖ్యంగా హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, ఫీజుల రియింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్స్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశ పెడతామని హామీ ఇచ్చారు. కృష్ణయ్య నేతృత్వంలో చేస్తున్న ఉధ్యమాలు దేశంలోని బిసి నాయకులు అధర్శంగా తీసుకోవాలన్నారు. కృష్ణయ్య, అయన అనుచరులు 10 మంది మధ్యప్రదేశ్ కు రావాలని ఆయన ఆహ్వానించారు. అందుకు కృష్ణయ్య అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు నందా గోపాల్. గుండేటి శంకర్, పృధ్వీ గౌడ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -