Thursday, January 23, 2025

రాడార్ స్టేషన్ ఏర్పాటు వ్యవహారంలో దొంగే ‘దొంగా దొంగ’ అన్నట్లుంది!

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ మండిపాటు
నాడు ప్రభుత్వ భూములను పర్సెంటీజీల కోసం ఇష్టానుసారంగా లీజులకిచ్చారని ఆగ్రహం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాడార్ సెంటర్ ఏర్పాటుతో పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని కలగదని పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే కాంగ్రెస్ ప్రభుత్వం చివరి అనుమతులను మంజూరు చేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్‌లో విఎల్‌ఎఫ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన నిజా నిజాలను వెల్లడించేందుకు మంత్రి సురేఖ తెలంగాణ సెక్రటేరియట్ మీడియా సెంటర్ లో మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాడార్ స్టేషన్ ఏర్పాటు వ్యవహారంలో దొంగే ‘దొంగా… దొంగ’ అని అరిచినట్టుగా బిఆర్‌ఎస్ పార్టీ వ్యవహార శైలి ఉందని కొండా సురేఖ అన్నారు. నాటి బిఆర్‌ఎస్ సర్కార్ ప్రభుత్వ భూములను పర్సెంటీజీల కోసం ఇష్టానుసారంగా ఇతరులకు లీజులకు ఇచ్చి తెలంగాణను దోచుకున్నదని ఆరోపించారు.

ప్రజలను మభ్య పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించి.. ఇప్పుడు నీతి సూత్రాలు చెపుతున్నారని బిఆర్‌ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు ప్రజల కోసం ఒక మంచి పని చేసిన పాపాన పోలేదని విమర్శించారు. దేశ భద్రతకు సంబంధించిన రాడార్ సెంటర్ నిర్మాణానికి నాడు అనుమతులు ఇచ్చిన బిఆర్‌ఎస్ నేడు రాజకీయ ప్రయోజనాల కోసం మోకాలడ్డడం హాస్యాస్పందంగా ఉందని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 లోనే వికారాబాద్‌లో రాడార్ సెంటర్ నిర్మాణానికి జీవో నెం. 44 ద్వారా తుది అనుమతులు మంజూరు అయ్యాయని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. రాడార్ సెంటర్ నిర్మాణంపై జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని ఈ సందర్భంగా మంత్రి సురేఖ తిప్పికొట్టారు. రాడార్ సెంటర్ కోసం 2010 లోనే భారత నావికాదళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టిందని, 14 ఏండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. 2014 ఆగష్టులో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూముల బదలాయింపు సంబంధించి డిమాండ్ నోట్‌ను నేవీకి పంపించారని, 2017 ఫిబ్రవరిలో పెరిగిన వేజెస్‌కు అనుగుణంగా పెంచినటువంటి ప్లాంటేషన్‌కు సంబంధించి స్థల మార్పును సూచిస్తూ నేవీకి మరోసారి ఉత్తరం రాశారని మంత్రి తెలిపారు.

ధరల పెంపు, స్థల మార్పు కూడా జరిగాయని మంత్రి వెల్లడించారు. అనేక సంప్రదింపుల అనంతరం 2017 డిసెంబర్ 19న జీవో నెంబర్ 44 ద్వారా నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అటవీ భూములను నేవీకి బదిలీ చేసిందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో రాడార్ సెంటర్ ఏర్పాటుతో దేశభద్రతలో తెలంగాణ రాష్ట్రానికి పాత్ర ఉందని మనం గర్వించాలిగానీ వీధి పోరాటం చేస్తాం, రాజకీయం చేస్తామంటే బిఆర్‌ఎస్ పార్టీ విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు. రాడార్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం, నాటి బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఆర్థిక లావాదేవీల అనంతరం ప్రక్రియ చివరి దశలో ఉండగా సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌ను తెలంగాణ రాష్ట్రానికి ఇస్తేనే చివరి అనుమతులు ఇస్తామని కెసిఆర్ పేచీ పెట్టారని తెలిపారు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సెక్రటేరియట్ కడితేనే తన కొడుకు ( కెటిఆర్ )కు ముఖ్యమంత్రి యోగం ఉందనే నమ్మకాలతో చివరి దశలో కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టిన షరతులతో రాడార్ సెంటర్ ఏర్పాటుకు బ్రేకులు పడ్డాయని, అందుకు కేంద్రం సమ్మతిస్తే నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం తుది అనుమతులు అప్పుడే ఇచ్చి ఉండేదని మంత్రి తేల్చి చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని, ఎవరి ప్రయోజనాలకు సంబంధించింది కాదని మంత్రి స్పష్టం చేశారు.

దేశంలోనే మొదటి సారిగా తమిళనాడులోని తిరునెల్వేలిలో ఏర్పాటైన రాడార్ స్టేషన్ 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్నదని, ఈ స్టేషన్ తో చుట్టు పక్కల ప్రాంతం అభివృద్ధి చెందిందని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే మీడియాను అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తామని అన్నారు. తిరునల్వేలి తర్వాత రెండో రాడార్ స్టేషన్ కేంద్రంగా వికారాబాద్ నిలువనుందని తెలిపారు. ఇది మనకు గర్వాకారణమని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. రాడార్ సెంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిందని అన్నారు. కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రజలకు ఎలాంటి నష్టం జరగదు కాబట్టే పరిశీలన అనంతరం తుది జీవో విడుదల చేశామని మంత్రి స్పష్టం చేశారు. రాడార్ సెంటర్ ఏర్పాటు వల్ల జంతువులు, మనుషుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. రేడియేషన్ తో క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. రాడార్ ప్రాజెక్టు వల్ల ప్రకృతికి నష్టం జరగదని, గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం అసలే లేదని తేల్చిచెప్పారు. హైకోర్టు ఈ ప్రాజెక్టు పై నమోదైన పిటిషన్ పై స్టే ఎత్తివేసినందున ఈ ప్రాజెక్టు ఏర్పాటులో ఎలాంటి అవాంతరాలు లేవని మంత్రి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News