ఉన్నతాధికారి కామపైత్యానికి మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
లక్నో : ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న గోకుల్ ప్రసాద్ (45) తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరడం విపరీతంగా మారి చివరికి ఆత్మహత్యకు దారి తీసింది. ప్రతిరోజూ లఖింపూర్ నుంచి అలీగంజ్‌కు ప్రయాణం చేసి ఉద్యోగం చేయాల్సి వస్తోందని, తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరాడు. దీనిపై బదిలీ కావాలంటే ఓ రాత్రికి భార్యను తన వద్దకు పంపాలని తనపై ఉన్నతాధికారి జూనియర్ ఇంజినీర్ అడిగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోకుల్ ఆఫీస్ బయటనే ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తోటి ఉద్యోగులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. లఖింపూర్ విద్యుత్ జూనియర్ ఇంజినీర్ ఆఫీస్ వద్ద ఈ సంఘటన జరిగింది. దీనిపై జూనియర్ ఇంజినీర్ నాగేంద్ర కుమార్, క్లర్క్ సస్పెండ్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన వీడియోలో ప్రసారం అయింది. మృతుడు గోకుల్ భార్య తన భర్తను గత మూడేళ్లుగా నిందితుడు వేధిస్తున్నాడని , ఈ వేధింపులకే తన భర్త డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడని పేర్కొంది. కానీ వారు మాత్రం తన భర్తను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా మరో వీడియోలో ప్రసారం అయింది. ఈ కేసులో నిందితుడైన జూనియర్ ఇంజినీర్‌ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.