Tuesday, January 21, 2025

ఎసిబి వలలో లింగంపేట్ ఎస్‌ఐ, రైటర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల ఎస్సై అరుణ్‌కుమార్, స్టేషన్ రైటర్ రామస్వామి అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ గురువారం లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ చేతికి రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు, బాధితుడు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన కొందరు యువకులు మద్యం సేవించి గొడవపడి ఒకరి తలపై బీరు బాటిల్‌తో కొట్టడంతో సదురు యువకునిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు స్టేషన్ బెయిల్ కోసం సదరు వ్యక్తి ఎస్సై అరుణ్‌కుమార్ సంప్రదించారు. స్టేషన్ బెయిల్ కావాలంటే 10 వేల రూపాయిల చెల్లించాల్సిందేనని ఎస్సై సదరు వ్యక్తికి స్పష్టం చేశారు. స్టేషన్ బెయిల్ కోసం ఇంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని మొరపెట్టుకున్న ఎస్సై వినలేదు.

దీంతో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శేఖర్‌గౌడ్‌ను బాధితుడు సంప్రదించాడు. అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ సూచనల మేరకు పదివేల రూపాయల నోట్లకు సదరు వ్యక్తి అందజేసి పంపించారు. ఆ డబ్బులు తీసుకెళ్లి సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ఇవ్వగా రైటర్ రామస్వామికి ఇవ్వాల్సిందిగా సూచించారు. ఆ డబ్బులను రామస్వామికి అందించి బయటకు రాగానే ఏసీబీ అధికారులు స్టేషన్‌లో రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఎస్సై అరుణ్‌కుమార్‌ని స్టేషన్ రైటర్ రామ స్వామిని ఏసిబి డిఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిని హైదారాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్పందించేందుకు ఏసీబీ అధికారులు నిరాకరించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐలు వేణుకుమార్, నగేష్, శ్రీనివాస్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News