Thursday, December 19, 2024

కెప్టెన్లు పెళ్లి చేసుకుంటే చాలు వరల్డ్ కప్ వచ్చేస్తుంది….

- Advertisement -
- Advertisement -

ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందనేది నానుడి. అందరు మగవాళ్ల విషయంలో ఇది నిజమైందో లేదో కానీ, క్రికెటర్ల విషయంలో మాత్రం ఈ నానుడిని నమ్మాల్సిందే. ఎందుకంటారా? ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్లలో చాలామంది పెళ్లిచేసుకున్నాకే, కప్పును గెలుచుకున్నారు మరి.

ఒకప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటింగ్ లో కాకలు తీరిన యోధుడు. పాంటింగ్.. రియన్నా జెన్నిఫర్ కాంటర్ అనే అమ్మడిని ప్రేమించాడు. ఇద్దరూ చెట్టపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారే కానీ, ఒక పట్టాన పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటావా లేదా అని జెన్నిఫర్ గట్టిగా అడగటంతో పాంటింగ్ 2002లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంతే, ఆ మరుసటి సంవత్సరం జరిగిన ప్రపంచ క్రికెట్ టోర్నమెంటులో పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కప్పును గెలుచుకుంది.

ఇక మన మహేంద్ర సింగ్ ధోని విషయానికొస్తే, అతను 2010లో సాక్షిసింగ్ రావత్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరం ధోని కెప్టెన్సీలో ఇండియా ప్రపంచ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందేగా. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా తన చిరకాల స్నేహితురాలు తారా రిడ్జ్ వేను 2019లో వివాహమాడాడు. ఆ వెంటనే అతనికి అదృష్టం కలసివచ్చింది. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంటులో ఇంగ్లండ్ గెలిచి, కప్పును ఎగరేసుకుపోయింది.

తాజా విజేత ఆస్ట్రేలియా విషయానికి వద్దాం. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తన చిరకాల ప్రేయసి బెక్కీ బోస్టన్ ను జులైలో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచీ అతన్ని విజయాలు వరించడం మొదలైంది. తాజాగా వరల్డ్ కప్పును గెలుచుకున్నాడు కదా.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ నలుగురు కెప్టెన్లూ పెళ్లి  చేసుకున్నాక, ఏడాది లోపే ప్రపంచ కప్ ను గెలుచుకోవడం. ఇది తెలిస్తే, మన కెప్టెన్ రోహిత్ శర్మ ఏమంటాడో? ‘తొందరపడి ముందే పెళ్లి చేసుకున్నాను, ప్రపంచ కప్ టోర్నీకి కాస్త ముందు చేసుకుని ఉంటే, కప్పు గెలిచుకుని ఉండేవాణ్ని కదా’ అని బాధపడతాడేమో!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News