Friday, January 10, 2025

ఇందిరమ్మ ఇళ్లలో సింహ భాగం నిధులు కేంద్ర సహకారంతో వచ్చినవే: బిజెపి నేత రాణి రుద్రమ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం వెచ్చించే సొమ్ములో సింహ భాగం కేంద్ర సహకారంతో వచ్చిన నిధులేనని బిజెపి అధికార ప్రతినిధి రాణీ రుద్రమ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర నిధులు హడ్కో ద్వారా కేంద్ర సహకారంతో వచ్చే రుణంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సోమవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొంటూ భారత దేశంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే 9 సంవత్సరాల కితం ప్రధాని మోడీ ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం ప్రారంభించి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు కట్టించి పేదల కల నెరవేర్చారని పేర్కొన్నారు.

తెలంగాణలో కూడా అందరికీ సొంత ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరమే 2.50 వేల ఇండ్లకు రూ.5894 కోట్లు కేటాయిస్తే అప్పటి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం వస్తుందన్న నమ్మకంతో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిన 70వేల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం లో చేర్చేందుకు జాబితా పంపిందని ఆ ఇళ్ల్లకు దాదాపుగా రూ. 600 కోట్లు కేంద్రం జమ చేయనుందన్నారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలో మొత్తం నిర్మించబోయే 95,235 ఇళ్లకు హడ్కో రుణం రూ. 3 వేల కోట్లు తీసుకోబోతున్నట్లు గా చెప్పారు. అంటే ఒక్కో ఇంటికి దాదాపు రూ. 3 లక్షల రుణం హడ్కో ద్వారా లభిస్తుందని వెల్లడించారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం ద్వారా అర్బన్ ప్రాంతంలో ప్రతి ఇంటికీ రూ. 1.50 లక్షలు గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి రూ. 72 వేలు కేంద్ర ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్న రూ. 5 లక్షలలో రూ. 4.50 లక్షలు కేంద్ర సహకారంతో లభిస్తున్న నిధులన్నారు. దేశంలో మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి రానున్న 5 సంవత్సరాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News