Monday, December 23, 2024

రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

- Advertisement -
- Advertisement -
ఈనెల 21వ తేదీన లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు
దరఖాస్తు రుసుం రూ.2లక్షలు
డిసెంబర్ 01వ తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభం

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-,25)కి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియను ఆబ్కారీ శాఖ షురూ చేసింది. మొదటిరోజు రంగారెడ్డి జిల్లాలో 10 దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో 07, సంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 12, ఇంకా మిగతా జిల్లాలోనూ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యిందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరించనుండగా ఆగస్టు 21వ తేదీన లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తు దారులు స్వయంగా ఆధార్ కార్డ్, పాన్‌కార్డ్, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకు రావాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతుంది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఈ ప్రక్రియను ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుంను గతంలో మాదిరిగానే రూ.2 లక్షలుగా (నాన్ రిఫండబుల్), స్పెషల్ రీటెయిల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఎస్‌ఆర్‌ఈటి)ను రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును డిడి రూపంలో కానీ, చలాన్ రూపంలో కానీ దరఖాస్తుదారులు చెల్లించవచ్చు. జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. నాంపల్లిలో ఎక్సైజ్ కార్యాలయంలో కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తుకు అవకాశం
ఒకే వ్యక్తి రాష్ట్రంలోని ఎక్కడైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడ్ దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించి ఈ లైసెన్సులు జారీచేస్తారు. వార్షిక ఆర్‌ఎస్‌ఈటీ (రీటెయిల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్) ఆరు సమానా వాయిదాల్లో చెల్లించవచ్చు. మొత్తం ఆర్‌ఎస్‌ఈటీలో 25 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసి పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు , ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలను అనుమతిస్తారు. 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారు, ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్ష పడినవారు, గతంలో ఎక్సైజ్ రెవెన్యూ ఎగ్గొట్టిన వారు, కోర్టు ద్వారా దివాలా తీసినట్టు ప్రకటించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని ఆబ్కారీ శాఖ తెలిపింది.
1,834 దుకాణాలు ఓపెన్ కేటగిరీగా…
ఎక్సైజ్ జిల్లాను యూనిట్‌గా తీసుకొని డ్రా పద్ధతిన రిజర్వుడ్ దుకాణాలను ఎంపిక చేస్తారు. జిల్లాలవారీగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారితో కూడిన కమిటీ సమక్షంలో కలెక్టర్లు ఎంపిక ప్రక్రియ నిర్వహించాలి. ఆ సమయంలో దీనిని అధికారులు వీడియో తీస్తారు. కొత్త మద్యం విధానం నోటిఫికేషన్ ప్రకారం గౌడ సామాజికవర్గానికి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కేటాయించారు. షెడ్యూలు ప్రాంతాల్లోని 95 దుకాణాలు పోనూ ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లకు సరిపడే రీతిలో 36 దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. మొత్తం 2,620 దుకాణాల్లో మూడు సామాజిక వర్గాలకు కేటాయించిన 786 షాపులు పోనూ మిగిలిన 1,834 దుకాణాలను ఓపెన్ కేటగిరీ కింద డ్రా తీస్తారు.
ఎస్టీలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాలు… అధికంగా కొత్తగూడెంలోనే
షెడ్యూలు ప్రాంతాల్లో ఎస్టీలకు ఇదివరకే రిజర్వు చేసిన 95 మద్యం దుకాణాల్లో దాదాపు సగం వరకు కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నాయి. ఆ జిల్లాలో 44 దుకాణాలను ఎస్టీలకు కేటాయించారు. భూపాలపల్లి, మహబూబాబాద్‌లో 11 చొప్పున, ఆదిలాబాద్లో 9, మంచిర్యాల, ఖమ్మంలలో 6 చొప్పున, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 4 షాపుల చొప్పున రిజర్వ్ చేశారు.
దుకాణాల రిజర్వేషన్ వివరాలు
మొత్తం మద్యం దుకాణాలు- 2620 కాగా, ఓపెన్ కేటగిరీ షాపులు- 1834 పోనూ మొత్తం రిజర్వుడ్ షాపులను 786 కేటాయించారు. వాటిలో గౌడలకు- 393 (15 శాతం), ఎస్సీలు- 262 (10 శాతం), షెడ్యూల్ ఏరియా ఎస్టీలకు- 95, నాన్ షెడ్యూల్ ఎస్టీలకు- 36, ఎస్టీలకు మొత్తం- 131 (5 శాతం) చొప్పున కేటాయిస్తారు.
మద్యం లైసెన్సుల షెడ్యూల్ ఇలా…..
నోటిఫికేషన్ జారీ,దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 4వ తేదీన
దరఖాస్తుల తుది గడువు: ఆగస్టు 18
లైసెన్సుల జారీ కోసం లాటరీ: ఆగస్టు 21
ఆర్‌ఎస్‌ఈటీ మొదటి చెల్లింపు గడువు: ఆగస్టు 21 నుంచి 22 వరకు
కొత్త ఏ4 షాపులకు స్టాక్ విడుదల: నవంబర్ 30
కొత్త షాపుల ప్రారంభం: డిసెంబర్ 1.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News