పది ఎకరాల బంగాళా విలువ రూ 400 కోట్లు
న్యూఢిల్లీ : మద్యం వ్యాపారిగా , కీలక లిక్కర్ కింగ్‌గా పేరొందిన దివంగత వ్యాపారి పాంటీ చద్దా అలియాస్ గురుదాస్ సింగ్ ఫామ్‌హౌస్‌ను కూల్చేశారు. ఢిల్లీలోని ఛత్రపూర్‌లో ఉన్న పది ఎకరాల ఈ తోట బంగళా విలువ రూ 400 కోట్లు అంతకు మించే ఉంటుంది. ఢిల్లీ మున్సిపల్ వ్యవహారాల డిడిఎ అధికారులు భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ బుల్‌డోజర్లతో కూల్చివేసి నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి , అక్రమ కట్టడాలకు పాల్పడ్డారని, పాంటీ చద్ధా కుటుంబం పేరిట ఈ ఫామ్‌హౌస్ ఉందని అధికారులు తెలిపారు.
అక్రమ కట్టడాలను నిర్మూలించడం జరుగుతుందని, శుక్రవారం, శనివారం ఈ ఫామ్‌హౌస్‌ను పూర్తి స్థాయిలో నిర్మూలించామని అధికారులు వివరించారు. ఈ ప్రాంతం దక్షిణ ఢిల్లీలో ఉంది. శుక్రవారం తొలుత ఐదెకరాల భాగాన్ని కూల్చివేశారు. మిగిలిన భాగం కూడా అక్రమం అని నిర్థారించుకుని దీనిని నేల మట్టం చేయడం జరిగిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ శివార్లలో పాంటీకి భారీ స్థాయిలో మద్యం వ్యాపారం ఉంది. ఈ మధ్యకాలంలో దేశ రాజధానిలో అక్రమకట్టడాలను నిర్మూలించడం యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది.
రికార్డులు, క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత అక్రమ కట్టడాలను నిర్థారించుకుని వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగుతోంది. అక్రమ నిర్మాణాలను కుప్పకూలుస్తున్నారు. ఇప్పుడు కూల్చివేతకు గురైన ఫామ్‌హౌస్ పాంటీ కుమారుడు మన్‌ప్రీత్ అలియాస్ మాంటీ అధీనంలో ఉంది.2012లో పాంటీ ఆయన చిన్న తమ్ముడు హర్దీప్ నడుమ ఈ ఫామ్‌హౌస్‌లోనే భూ వ్యవహారాలపై ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో అప్పట్లో హర్దీప్ పాంటీని కాల్చి చంపగా, దీనికి ప్రతిగా పాంటీ బాడీగార్డు కాల్పుల్లో హర్దీప్ చనిపోయాడు. ఈ క్రమంలో ఈ లిక్కర్ కింగ్ వ్యవహారం, ఇక్కడి స్థలం విషయం వెలుగులోకి వచ్చింది. అధికారుల పరిశీలనలు, రికార్డుల తనిఖీలతో ఇది అక్రమ కట్టడం అని తేలింది. ఇప్పుడు జరిగిన కూల్చివేతలపై ప్యాంటీ సంస్థ వేవ్‌గ్రూప్ ఎటువంటి స్పందనకు దిగలేదు. వేవ్ గ్రూప్ ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా లిక్కర్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో కోట్లు గడిస్తోంది.