Wednesday, November 13, 2024

రెండో ఛార్జీషీట్ దాఖలు చేసిన ఈడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మద్యం ఎక్సయిజ్ పాలసీ కేసులో శుక్రవారం రౌజ్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) రెండో అభియోగపత్రాన్ని దాఖలుచేసింది. అభిజ్ఞ వర్గాల ప్రకారం అభియోగపత్రంలో మొత్తం 12 మంది నిందితుల పేర్లను పేర్కొన్నారు. అందులో ఐదుగురు అరెస్టయినవారు(వినయ్ నాయర్, శరత్ రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా), 7 కంపెనీలు ఉన్నాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫార్మేషన్ రిపోర్టు(ఈసిఐఆర్)పాత్రపై, వివిధ ఆరోపణల కింద ఇతరులపై మరింత దర్యాప్తు జరుపుతున్నారు. ఈడి తన తొలి అభియోగపత్రాన్ని సమీర్ మహేంద్రు, అతడి సంస్థలపై దాఖలు చేసింది. ఈడి అధికారులు, కేసుకు సంబంధించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్‌పిపి) అభియోగపత్రాన్ని రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ద రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు.

ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన నిందితులందరిపై మరో కామన్ ఛార్జీషీట్‌ను 2023 జనవరి 6న దాఖలు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ఇదివరలో స్పెషల్ జడ్జీ ఎంకె నాగ్‌పాల్‌కు తెలిపింది. గత నెల ఎక్సయిజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తొలి ప్రాసిక్యూషన్ కాంప్లయింట్(ఛార్జీషీట్)ను ఈడి దాఖలు చేసింది. ఆ ఛార్జీషీట్‌ను వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, మరి కొన్ని సంస్థలపై దాఖలు చేసినట్లు ఈడి అధికారులు కోర్టుకు నివేదించారు.
60 రోజుల నిర్ధిష్ట గడువు ఈ రోజు ముగియనుండడంతో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుపై ఛార్జీషీటును దాఖలు చేసింది. ఈడి ఈ కేసులో సెప్టెంబర్ 27న సమీర్ మహేంద్రును తొలి అరెస్టు చేసింది. ప్రస్తుతం కోర్టు వ్యాపారవేత్త శరత్ రెడ్డి, సమీర్ మహేంద్రు, బినోయ్ బాబు, అభిషేఖ్ బోయినపల్లి, విజయ్ నాయర్ పెట్టుకున్న ఐదు బెయిల్ పిటిషన్లను పరిశీలిస్తోంది. కాగా ఆరో నిందితుడు అమిత్ అరోరా కూడా ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఎక్సయిజ్ పాలసీలో అక్రమాలు జరిపారని ఈడి, సిబిఐ ఆరోపిస్తున్నాయి. లైసెన్సు హోల్డర్లకు అనుగుణంగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకు లైసెన్సు ఫీజును మాఫీ చేయడం లేక తగ్గించడం చేశారని, సంబంధిత అధికారి ఆమోదం లేకుండానే ఎల్1 లైసెన్సును పొడగించారని పేర్కొన్నారు. ప్రయోజనం పొందిన వారు తమ అక్రమ లాభాలను నిందిత అధికారులకు మళ్లించారని, తమ ఖాతా పుస్తకాలలో తప్పుడు ఎంట్రీలు రాశారని పేర్కొన్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినాయ్ కుమార్ సక్సేనా సిఫార్సు మేరకు కేంద్ర హోం మంత్రి ప్రోద్బలంతోనే ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News