జూలైలో రూ.2,767.73 కోట్ల ఆదాయం
27.16 లక్షల కేసుల బీర్లతో పాటు
34 లక్షల కేసుల లిక్కర్‌ల విక్రయం
విక్రయాల్లో మొదటిస్థానాన్ని దక్కించుకున్న
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.643 కోట్ల విలువైన మద్యం విక్రయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా నమోదవువుతున్నాయి. జూలై నెలలో రికార్డు స్థాయిలో భారీగా మద్యం అమ్ముడు పోయింది. ఏకంగా రూ.2,768 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌ల ద్వారా మొత్తం విక్రయాల్లో 60 శాతం అంటే రూ.1,600 కోట్లుకు పైగా మొత్తం జూలై నెలలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.
జూలై నెలలో రికార్డు స్థాయిలో రూ.2,767.73 కోట్ల విలువైన 34 లక్షల కేసుల లిక్కర్‌లతో పాటు, 27.16 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరగడం ఇదే ప్రప్రథమం ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.643 కోట్ల విలువైన మద్యం అమ్ముడవ్వగా, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో రూ.63 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. జిల్లాల వారీగా మద్యం విక్రయాలు ఇలా ఉన్నాయి
ఉమ్మడి జిల్లా మద్యం విక్రయాలు
రంగారెడ్డి రూ.643 కోట్లు
హైదరాబాద్ రూ.308 కోట్లు
నల్గొండ రూ.288.91 కోట్లు
వరంగల్ రూ.230.53 కోట్లు
మెదక్ రూ.212.17 కోట్లు
మహబూబ్‌నగర్ రూ.196.73 కోట్లు
కరీంనగర్ రూ.196 కోట్లు
ఆదిలాబాద్ రూ.142.87 కోట్లు
నిజామాబాద్ రూ.134.92 కోట్లు
ఆదాయంలో 60 శాతం వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ….
ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో రూ.134.92 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో రూ.142.87 కోట్లు, కరీంనగర్ రూ.196 కోట్లు, మహబూబ్‌నగర్ రూ.196.73 కోట్లు, మెదక్ రూ.212.17 కోట్లు, వరంగల్ రూ.230.53 కోట్లు, నల్గొండ రూ. 288.91 కోట్లు, హైదరాబాద్ రూ.308 కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం విక్రయాల్లో ఉత్పత్తి, విక్రయదారులకు కలిపి 40 శాతం పోగా మిగిలిన 60 శాతం వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ కింద రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.
బీరు ధర తగ్గించిన ప్రభుత్వం…
తెలంగాణలో బీరు సీసాపై పది రూపాయలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విక్రయాలు భారీగా పడిపోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ తరువాత అమ్మకాలు జోరందుకున్నాయి. అందుకు తాజాగా వెలువడిన గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో బీరు సీసాపై ప్రత్యేక ఎక్సైజ్ సెస్ పేరుతో 30 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం విధించగా అందులో నుంచి రూ.10లను తగ్గించింది.