బీరు, బ్రాందీలో మునిగి తేలడం వల్లే ఆప్‌ను ప్రజలు ఛీకొట్టారు
అవినీతికి వ్యతిరేకమన్న కేజ్రీవాల్ దానికే చిరునామాగా మారారు
రాహుల్ ఉన్నంత కాలం కాంగ్రెస్ దేశంలో ఎక్కడా గెలవదు
ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బిజేపిదే గెలుపు
: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఉన్న సవాలక్ష కారణాల్లో ప్రధాన కారణం మద్యం కుంభకోణమేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీరు, బ్రాందీలో కేజ్రీవాల్ మునిగి తేలడం వల్లే ఆప్‌ను ప్రజలు ఆయనను ఛీకొట్టారని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ నిందితుడా..? కాదా అనేది ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైందని, ఇక కోర్టే నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ చివరికి ఆయనే అవినీతికి చిరునామాగా మారిపోయారని విమర్శించారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాలు ఉదాహరణగా నిలిచాయని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం బిజెపితోనే సాధ్యమని భావించి భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం వల్లే ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదని తెలిపారు. ఎన్నికల్లో ఎన్నో ఉచిత పథకాల పేరిట ఇచ్చిన హామీలను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. బిజెపితోనే భవిష్యత్తు, మోడీతోనే గ్యారంటీ అని ప్రజలు గుర్తించి ఓట్లేసి గెలిపించారని తెలిపారు. ఇప్పుడే కాదు 2050లో కూడా ఆప్‌ను ఓడించడం మోడీ తరం కాదని నోటికొచ్చినట్లు మాట్లాడిన కేజ్రీవాల్ అహంకారం నేటి ఢిల్లీ ప్రజల తీర్పుతో అణిగిపోయిందని అన్నారు.
ఆ మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలుపు మాదే
భవిష్యత్తులో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మూడు రాష్ట్రాల్లో బిజెపిదే విజయమని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి మూడు రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా గెలవదని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆ పార్టీ కార్యకర్తలే విశ్వసించడం లేదని అన్నారు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ఒకే రకంగా ఆలోచిస్తున్నారని, తాము గెలవాలని అనుకోవడం లేదని, బిజెపి గెలవకూడదని అనుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
కేజ్రీవాల్, సిసోడియా వంటి నేతలను ఢిల్లీ ఓటర్లు ఓడించారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ దీనస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇది ఎన్నో ఓటమో లెక్కపెట్టలేమని అన్నారు. ఢిల్లీలో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్ అయ్యిందని చురకలు వేశారు. అసలు గెలవాలనే ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఉండదని, మోదీని, బిజెపిని ఓడించాలని మాత్రమే రాహుల్ గాంధీ ఆలోచన చేస్తారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగటం కాదని, రాజ్యాంగ విలువలు పాటించాలని కిషన్‌రెడ్డి సూచించారు. జైలు నుంచే పరిపాలన చేసిన కేజ్రీవాల్ డ్రామాలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఢిల్లీలో ఇకపై అభివృధ్ధి జరుగుతుందని కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఢిల్లీలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.