హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని రిటైల్ మద్యం షాపులకు లాటరీ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎంపిక కార్యక్రమాన్నీ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. శనివారం అంబర్‌పేటలోని మహారాణ ప్రతాప్ పంక్షన్ హాల్‌లో నిర్వహించిన లాటరీ కార్యక్రమంలో హైదరాబాద్ రెవెన్యూలోని సికింద్రాబాద్ జిల్లాకు రఘనందన్‌రావు సెక్రటరీ అగ్రికల్చర్, హైద్రాబాద్‌కు జిల్లా కలెక్టర్ శర్మన్ ముఖ్య అతిథులుగా హజరై లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిగా పారదర్శకతతో మద్యం దుకాణాల లాటరీని నిర్వహించామని, హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో మొత్తం 179 షాపులు ఉన్నాయని, అయితే వీటిలో ఒక షాపుకు మాత్రం లాటరీ తీయటం లేదని, దానికి దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చినందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటి లక్కీ డ్రాను నిలిపివేయడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల వచ్చిన తరువాత దీనికి కూడా లక్కీ డీప్ తీస్తామని, అందువల్ల ఈషాపుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ బీసీ కమ్యూనిటీలో గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేస్తూ వాటన్నింటికి కలిపి శనివారం లక్కీ డ్రా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని మద్యం షాపులను ఏలాంటి రాగద్వేషాలకు తావివ్వకుండా పూర్తి స్వేచ్చగా, పారదర్శకంగా లాటరీ ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈకార్యక్రమంలో శ్రీనివాసరావు, నవీన్‌కుమార్, శ్రీనివాసమూర్తి, పవన్‌కుమార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అధికారులు హాజరైయ్యారు.