ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక
ఆదివారం సాయంత్రం తిరిగి తెరుచుకోనున్న మద్యం షాపులు
హైదరాబాద్ : ఆరు జిల్లాల పరిధిలోని మద్యం షాపులు మూతపడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్‌షాపులతో పాటు బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. మార్చి 14వ తేదీన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో మద్యం షాపులను మూసివేయాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి మార్చి 14వ తేదీన పోలింగ్ ముగిసిన తరువాతే మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. అంతేకాదు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే మార్చి 17వ తేదీన కూడా వైన్‌షాపులను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. ఈ నిబంధనలను అందరూ పాటించాలని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. బ్లాక్‌లో మద్యం అమ్మిన సదరు వైన్‌షాపు లైసెన్స్‌లను రద్దు చేస్తామని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు.
Liquor shops close by due to MLC elections