Saturday, November 9, 2024

వెలుగులు ప్రసరిస్తున్న బస్తీబడి

- Advertisement -
- Advertisement -

‘Recent findings reveal that literate individuals tend to have higher earning potential, improved health outcomes, and greater civic engagement. Literacy is not merely a skill; it is a corner stone for personal growth and empowerment’ Firdosh Khan, Education Marketing Consultant, India
‘Literacy is the ability to decode text and to produce text to make meaning. Literacy is both a science and a skill. It is the mechanics of reading and writing. It provides the structures and patterns -the engineering -that enable literature to exist. Literacy is the foundation for all word-based communication’ Mariam Karis Cronin, Sr.Educator, USA

సంపూర్ణ అక్షరాస్యత ఇప్పటికీ దూరాన కనిపిస్తున్న గమ్యం, కంటికి దక్కని సామాజిక స్వప్నం. ఈ దిశగా యునెస్కో నుంచి వీధి బడి దాకా వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు అక్షరాస్యతను ప్రాథమిక హక్కుగా ప్రచారం చేస్తూ సంపూర్ణ అక్షరాస్యత కోసం విరామం లేని ప్రయత్నాలెన్ని చేస్తున్నా ఇంకా పలకల మీద అక్షరాలు రాయలేని వాళ్లు, చదవలేని వాళ్లు మన మధ్య కోకొల్లలుగా ఉన్నారు. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకే పరిమితమై లేదు. పట్టణ, -నగర పేదల్లోనూ అత్యధిక శాతం నిరక్షరాస్యులున్నారు. చంద్రమండల శోధకులైన ప్రతిభావంతులూ, అక్షరం రూపురేఖలకు అబ్బురపడుతూ చంకన పలకలు పట్టుకుని కమ్యూనిటీ లిటరసీ కేంద్రాలకు తరలివెళ్తున్న నిరక్షరాస్యులూ భారతీయులే కావడం మన దేశ సామాజిక పటానికి ఇరుపార్శ్వాలిప్పుడు. మొన్న అంటే ఈ నెల 9, 10 తారీఖుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జి 20 సమావేశాల్లో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదం ఇవ్వడం వరకూ, భారత్ ఆతిథ్య దేశంగా అధ్యక్షదేశంగా వ్యవహరించడం వరకూ గర్వపడవలసిన విషయమే.

కానీ, ఇప్పటికీ అక్షరాలు నేర్వని అధో జనత ఉన్న దేశంగా ‘ఒకే భూమి’ సరే, ‘ఒకే కుటుంబం’ సరే, ‘ఒకే భవిష్యత్తు’ సాధ్యపడే విషయమేనా? అనేది మనకు మనం సంధించుకోవాల్సిన ప్రశ్న. సమాధానం కోసం, పరిష్కారం కోసం నిర్వివాదంగా ప్రయత్నించాల్సిన అంశం. అక్షరాస్యతకు సంబంధించి నిపుణులు అభివృద్ధి చేసిన రెండు ప్రధాన సిద్ధాంతాలను గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. వీటిలో మొదటిది, మొత్తం మానవ నాగరికతకు, దాని సారూప్య భావనలకు చెందిన ఆలోచనలతో అక్షరాస్యత పరస్పర సంబంధం కలిగి ఉండడం. ఇది అక్షరాస్యతను ‘స్వయంప్రతిపత్తి కలిగిన’ స్వతంత్ర నైపుణ్యంగా పరిగణించడమే కాదు, ఊహించదగిన పరిణామ క్రమంలో అక్షరాస్యత కొనసాగగలదనీ చెబుతుంది. రెండోది, విధానపరంగా చాలా విభిన్నంగా అక్షరాస్యత ‘సైద్ధాంతిక’ దృగ్విషయంగా అగుపించడం. ఇదే కాకుండా సామాజిక సమాయత్తం (social setting) ప్రకారం అక్షరాస్యత విస్తృతంగా అనూహ్యంగా ‘PINC (Power, Interaction, Norms, Choices and Decisions)’ గానూ మారడం.

ఈ రెండూ కేవలం రెండు నమూనాలుగానే కాకుండా 1990 అనంతరం అక్షరాస్యతను మేధో సంపత్తికి పెట్టుబడిగా సిద్ధాంత కర్తలు ధ్రువీకరించి సామాజిక ప్రభావితాంశం (social influencer) గానూ గుర్తించారు. ఇందుకు అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య గల ఇప్పటి భారీ అంతరాలే రుజువులు, సాక్ష్యాలు.సిద్ధాంతీకరణ కాసేపు పక్కనబెడితే, అక్షరాస్యత వ్యక్తులకు నేరుగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వారి వారి స్థాయిల్లో వ్యక్తిగత అభివృద్ధిని వేగవంతమూ, సుసంపన్నమూ చేస్తుంది. ఆలోచనా పరిధులను విస్తరిస్తుంది. అక్షరాస్యత జ్ఞానానికి ప్రవేశ ద్వారం అవడంతో పాటు, సమాచారంతో కూడిన ప్రాపంచిక విషయాలను ఎప్పటికప్పుడు ఎరుక పరుస్తుంది. వృత్తి ఉద్యోగ పనిక్షేత్రాల్లో సక్రియాత్మక విమర్శనా దృష్టిని, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని, నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. అందుకే అక్షరాన్నీ చదువునూ ‘దీపం’ అని, ‘వెలుగు’ అని సాక్షరతా కార్యక్రమంలో విద్యావేత్తలు సంబోధించారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలు సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం చేస్తున్న కార్యక్రమావళితో పాటు, స్వచ్ఛంద సంస్థలూ అనేక చోట్ల అనేక రకాల అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

వీటిల్లో మరీ ముఖ్యమైనవి కమ్యూనిటీ ఆధారిత (Community based initiatives) కార్యక్రమాలు. నిరక్షరాస్యుల కుటుంబాలు, నిరక్షరాస్య సామాజిక సమూహాలు అక్షరాస్యులు కావడాన్నే కమ్యూనిటీ లిటరసీ అంటారు. రోజువారీ కార్యకలాపాల ద్వారా ఆయా కుటుంబాలను, సామాజిక సమూహాలను ఒకచోట చేర్చి చదువు నేర్పించడమే కమ్యూనిటీ ఆధారిత అక్షరాస్యత కార్యక్రమం. ప్రతి ఒక్కరూ పరిసరాల ఆధారంగా చదువు నేర్చుకుంటూ తమలోని అక్షరాస్యత నైపుణ్యాలను గుర్తించడం, అక్షరాస్యతా చైతన్యాన్ని ప్రదర్శించేలా అభ్యాసకులకు తర్ఫీదివ్వడం ఇందులో ప్రధాన కార్యాచరణ. అక్షరాల ముఖం చూడని గ్రామీణ, పట్టణ నిరక్షరాస్యుల్లో అక్షర దీపం వెలిగించే పనిలో నిమగ్నమైన కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు సమాజాభివృద్ధి కోసం తమ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాయి.స్థానిక కమ్యూనిటీల ప్రత్యేక అవసరాలను పరిష్కరించడానికి, సమ్మిళితత్వాన్ని పెంపొందించడానికి, సుస్థిరతా సాధనకు సహకారం తోడ్పాటునందిస్తున్నాయి. కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని, సామాజిక ఐక్యతకూ ఆర్థికాభివృద్ధికీ తమ వంతుగా కృషి సల్పుతున్నాయని జాతీయ, అంతర్జాతీయ వేదికలు సైతం చాటుతున్నాయి. అక్షరాస్యతానంతరం తమ కమ్యూనిటీల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితం మెరుగుపడేందుకూ తద్వారా మొత్తం సామాజిక శ్రేయస్సు సాకారమయ్యేందుకు వయోజనులు ఉద్యమించడమూ జరగుతుంది.

ఆయా చోట్ల అట్టడుగు వర్గాల వయోజన విద్యను, బాల్య విద్యను కమ్యూనిటీ లిటరసీ కార్యక్రమాలు సృజనాత్మకంగా నడుపుతున్నాయి. కుదిరిన చోట్ల కొంచెం ముందుకెళ్లి కమ్యూనికేషన్ స్కిల్స్, పర్యారణం, ఆరోగ్యం, వృత్తి సామర్థ్యం, ఉపాధి- మార్కెటింగ్ సౌకర్యాలు, బ్యాంకింగ్- పొదుపు, కళాసంస్కృతులపై అధ్యయనాలనూ నిర్వహిస్తున్నాయి.
మన రాష్ట్రంలో పలు చోట్ల కమ్యూనిటీ లిటరసీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిల్లో వరంగల్ నగరం ఎన్.జి.ఓస్ కాలనీ- 2 లోని ఇందిరమ్మ బస్తీలోని ‘బస్తీబడి’ ఒకటి. స్థానిక ప్రేరణ ఫౌండేషన్, ‘మెప్మా’ మహిళా ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బస్తీబడిలో పిల్లలూ, పెద్దలూ కలిపి ముప్పై మంది దాకా చదువుకుంటున్నారు. గత వారం నాకు ఈ బస్తీబడిని సందర్శించే అవకాశం కలిగింది. ఆ కాలనీలో ఒకానొక వీధి మలుపులో వారగా కూర్చొని అక్షరాలు దిద్దుతూ, రాస్తూ, చదువుతూ పదాలను, అర్థాలను నేర్చుకుంటున్న ఈ బస్తీ బడి వాసులకు అక్షరాస్యత పట్ల మక్కువను, గౌరవాన్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

అభ్యాసపరంగా అక్షరాస్యతలో వర్ణమాల పట్ల అవగాహన (phonological awareness), అక్షరాలను శబ్దాలను చదివే, రాసే విధానం (phonics), పదజాలం (vocabulary), అభ్యాసపటిమ (Fluency), అవగాహన లేదా ఆకళింపు (comprehen sion), రాయడం (writing) అనే ఆరు విషయాలు అత్యంత కీలకమైనవి. భాషా శాస్త్రజ్ఞులు వీటినే బిగ్ సిక్స్ (BigSix) అంటారు. ఈ బిగ్ సిక్స్‌ను అనుకున్నవి అనుకున్నట్టుగా బస్తీబడి వాసులు నేర్చుకుంటున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ‘కామన్ కోర్ స్టేట్ స్టాండర్స్’ ను సమీక్షిస్తూ అధ్యాపకురాలు ఎం.కె. క్రోనిన్ చేసిన వ్యాఖ్యను అక్షరాక్షరం నిజం చేస్తూ బస్తీబడి ‘లాంగ్వేజ్ ఇంజనీరింగ్’ లో లీనమైంది. ఇదంతా ఒక ఎత్తు అక్షరాస్యత మీద ఈ బస్తీబడివాసులకున్న దృక్పథం మరో ఎత్తు. ఎందుకంటే ఒక దృక్పథం లేకుండా ఏ నైపుణ్యమూ పెంపొందదు. దృక్పథమే విషయ పరిజ్ఞానానికి బలమైన పునాది. దృక్పథాన్ని బట్టే చేసే పనులుంటాయి, దృక్పథాన్ని అనుసరించే దారులుంటాయి. మార్కెట్ దృక్పథం వేరు, మానవీయ దృక్పథం వేరు. ఆర్థిక దృక్పథం వేరు. ఆదర్శ దృక్పథం వేరు.

ఈ దృష్ట్యా నేను వాళ్లను ‘చదువు వెలుగు’ అనడం వింటున్నాం కదా! నిజంగా వెలుగేనా? వెలుగైతే ఎక్కడ వెలుగు?’ అనే ప్రశ్నలు అడిగాను. అందరి తరఫున ‘ఆత్మలో వెలుగు, ఆత్మకు వెలుగు’ అంటూ సంతోష అనే పెద్దామె జవాబిచ్చింది. నిజమే సంతోష ఎంత గొప్పగా ఆలోచిస్తున్నదో స్పష్టంగా అర్థమవుతున్నది. బయటి వెలుగు కన్నా మనిషిలోపల వెలుగు సర్వోత్కృష్టమైంది. భాషాధ్యయనంలో భావ ప్రసరణ ‘Q-Value’ తెలిసిన సుప్రసిద్ధ సామాజిక వేత్త, గ్లోబల్ లాంగ్వేజ్ సిస్టమ్ అభివృద్ధి కర్త అబ్రమ్ డి స్వాన్ వంటి భాషా శాస్త్రజ్ఞులు మాత్రమే చెప్పగలిగిన అత్యద్భుమైన మాట సంతోష నోట విన్నాను. మూడున్నర దశాబ్దాల నా బోధనానుభవంలో విద్యా ప్రయోజనానికి విపులార్థం చెప్పిన సంతోషకు అక్కడి వేయిస్తంభాల గుడి సాక్షి గా నేను పెట్టుకున్న పేరు ఈశ్వరమ్మ. అందరూ భావిస్తున్నట్టు నాలెడ్జ్, విజ్డమ్, స్కిల్స్ మాత్రమే కాకుంగా చదువును అంతకు మించిన శక్తి ప్రదాయినిగా అభివర్ణిస్తున్న ఈశ్వరమ్మ ఒక శ్రామిక మహిళ. ఆత్మలో వెలుగు అంటున్న ఈశ్వరమ్మ చిన్నతనంలోనే బడికెళ్లి వుంటే ఎన్ని తిమిరాలను తరిమేదో.

ఎంత జ్ఞానజ్యోతిని సమాజానికి ప్రసరించేదో. ఆరుపదులు దాటాకనైనా బస్తీబడి రూపంలో అక్షరం ఆమెకు చేరువైనందుకు నిర్వాహకులను అభినందనందిస్తున్నాను.ఈశ్వరమ్మతో పాటు అక్కడి వయోజనులందరి చదువుల కల సాకారం కావాలని కోరుకుంటూ ప్రతి పట్టణంలో, నగరంలో మరిన్ని కమ్యూనిటీ లిటరసీ కేంద్రాలను స్వాగతిస్తున్నాను. జయహో! బస్తీబడి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News