Wednesday, January 22, 2025

సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లపై న్యాయవిచారణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మంత్రులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి  వెంకట్‌రెడ్డిలు విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పైరవీలకు తావులేకుండా రేషన్ కార్డులను అర్హులైన పేదలకు ఇస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొన్ని అమలు చేస్తున్నామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్లు, సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇస్తామని ఆయన తెలిపారు.
మొదటి విడతగా 4 లక్షల 50వేల ఇళ్లు.. రూ.22,500 కోట్ల ఖర్చు
మొదటి విడతగా 4లక్షల 50వేల ఇళ్లను ఇస్తామని దీనికోసం రూ.22వేల 500 కోట్లు ఖర్చు అవుతాయని దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీంతోపాటు మినిమం టైం స్కేల్‌తో 2008 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఓఆర్‌ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. 25 నుంచి 30 ఎకరాల్లో వాటిని అమ్ముకునే సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతుబంధు 84 శాతం మందికి ఇచ్చామని, రాబోయే రెండు,మూడు రోజుల్లో మరి కొంతమందికి రైతుబంధు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షల వరకు బీమా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. మహిళా సాధికారత కోసం 15 అంశాలతో ప్రత్యేక కార్యక్రమం కోసం కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.
కాళేశ్వరంపై జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్‌ను నియమించాం
మరోవైపు కాళేశ్వరంపై జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి చంద్ర ఘోష్ నియమించామని తెలిపారు. విచారణ వంద రోజుల్లో పూర్తి చేయా ల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల దర్యాప్తు కోసం జస్టిస్‌ఎల్. నరసింహరెడ్డిని నియమించామని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌ఘడ్ విద్యుత్ కొనుగోళ్లపై కూడా విచారణ చేసి వంద రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చినట్టు ఆయన తెలిపారు.
బలహీన వర్గాలకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం
తెలంగాణ కేబినెట్ పలు కార్పొరేషన్లకు ఆమోదం తెలిపిందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా అసెంబ్లీలో కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పామన్నారు. 16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ, మున్నూరు కాపు, పెరిక, గంగపుత్ర, పద్మశాలి కార్పొరేషన్, ఓబిసిలకు కార్పొరేషన్, వైశ్య, రెడ్డి కార్పొరేషన్, మాల, మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటితో పాటు మూడు ప్రత్యేక కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అందులో ఏకలవ్య, ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడీ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీంతోపాటు గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
మంత్రులందరం ఒక టీమ్‌గా పని చేస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులందరం ఒక టీమ్‌గా పని చేస్తున్నామన్నారు. తాము ఎన్నికల కోసం నిర్ణయాలు తీసుకోవడం లేదని, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే చెప్పినవి చేస్తున్నామన్నారు.
బావబామ్మర్దులు (కెటిఆర్, హరీశ్‌రావులు) జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రి సూచించారు. ఇకనైనా బిఆర్‌ఎస్ నేతలు ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు. గులాబీ నేతలు రోజూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోమన్నారు. వారు మాట్లాడకపోతే తాము ఆర్థిక క్రమశిక్షణతో ఉంటామన్నారు. మాజీ సిఎం కెసిఆర్ లక్ష అబద్ధాలు చెప్పారని మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో కోటీశ్వరులుగా మహిళలు : శ్రీధర్‌ బాబు
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇందిరమ్మ రా జ్యం రావాలి, బలహీన వర్గాల గణన జరగాలన్నారు. 2008 డిఎస్సీ అర్హ త పొం దిన వారికి వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో మహిళలను కోటీశ్వరులను చేయాలని భావిస్తున్నామన్నా రు. మహిళల కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ కోసం మహాలక్ష్మీమహిళా శక్తి తెచ్చామన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది జరగవద్దని ఆర్‌డబ్ల్యూఎస్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురవక, రిజర్వాయర్లలో నీరు లేదన్నారు. ఎవరికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కొత్త కార్పొరేషన్ల విధి, విధానాలు తయారు చేయడం కోసం త్వరలో సంబంధిత వర్గాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News