న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారంనుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం మొదలైంది. ప్రస్తుతం యు ట్యూబ్ వేదికగా వీటిని ప్రసారం చేస్తున్నారు. త్వరలో సొంత మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ సోమవారం తెలిపిన విషయం విదితమే. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ సేన వర్సెస్ పేన కేసుపై జరిగింది. మహారాష్ట్రలో షిండే వర్గం తిరుగుబాటు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, షిండే వర్గాలమధ్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తర్వాత నెమ్మదిగా ఇతర ధర్మాసనాల విచారణలను కూడా లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాట్లు చేస్తోంది. కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2016లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. అయితే భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌వి రమణ పదవీ విరమణ రోజైన ఆగస్టు 26న ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారణను దేశప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.సుప్రీంకోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే మొదటి సారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రక నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసుల విచారణను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలగనుంది.