Saturday, January 11, 2025

ప్రకృతి వైపరీత్యానికి చితికిన లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలు

- Advertisement -
- Advertisement -

ములుగు : భారీ వానలు తగ్గుముఖం పట్టాయి. వరదలు తగ్గాయి, 16మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంటనష్టం, పశు నష్టం, వర్షం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీరని చేదు అనుభవాన్ని మిగిల్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌజ్ లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాష్ ఆలం, జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి, రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డిలతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పటి కప్పుడు వరదల పరిస్థితులపై సమీక్షించారని, ఆరా తీస్తూ, సహాయక చర్యలు సమర్థవంతంగా అందేందుకు కృషి చేశారని తెలిపారు.

వర్షాలు తగ్గుముఖం పట్టాయని, నష్టాల ఆనవాళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యానికి చితికిన లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలు మనకు కనిపిస్తున్నాయని అన్నారు. వారందరికి ప్రభుత్వం అండగా నిలిచిందని, ఆపన్నులను ఆదుకుందని తెలిపారు. తీవ్ర నష్టాల నుంచి కాపాడిందని తెలిపారు. అయినా నష్టాలు జరిగాయని, గత నాలుగైదు రోజులుగా నిరంతరం పని చేస్తున్న అధికారులను, రెస్కూ బృందం సభ్యులను మంత్రి అభినందించారు. జిల్లా యంత్రాంగం కాపాడటానికి ఎంత ప్రయత్నించినా 16 మంది చనిపోవడం దురదృష్టకరం వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాణనష్టం అయిన కుటుంబాలను, ఆస్తినష్టం, పంటనష్టం కుటుంబాలను ఆదుకుంటుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని, గతంలో గోదావరి ప్రాంతాలలో నష్టం జరిగిందని, ఇప్పుడు ఒకేరోజు అధికంగా వర్షం పడటం వలన జంపన్నవాగు, గుండ్లవాగు, దయ్యాలవాగు ఎక్కువ నీరు రావడం వలన ప్రమాదం జరిగిందని అన్నారు.
గోదావరి నదిలో లోతట్టు ప్రాంతాలలో అప్రమత్తం చేయగా, గోదావరి నది ప్రవాహం 10వేల క్యూసెక్కుల, మొదటి ప్రమాద హెచ్చరిక లోబడే ఉన్నదని ప్రమాదం లేదని తెలిపారు. ఇసుక మేటల ద్వారా పంట పొలాలకు చాలా నష్టం జరిగిందని అన్నారు. 27 పునరవాస కేంద్రాలలో 5,400 మందికి భోజనాలు వసతులు ఏర్పాటు చేశామని, మేడారం, నార్లాపురం వెళ్లే దారిలో మరమ్మతు పూర్తి కాలేదని రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు. 805 చెరువులు నిండగా, 72 చెరువులు కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని, 58 గ్రామాలలో కరెంటు నిలిచిపోయినందున 40 గ్రామాలలో వెంటనే పునరుద్దరించడం జరిగిందని అన్నారు.

18 గ్రామాలలో ఎక్కువ మేరకు కరెంట్ స్తంభాలు విరిగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోవడం వలన మరమ్మత్తు చేపట్టడం జరుగుతున్నదని, దెబ్బతిన్న జాతీయ రహదారులు మరమ్మత్తులు ఇప్పటికే ప్రారంభించడమైనదని, ముత్యంధార కు పర్యటనకు వచ్చి చిక్కుకున్న 82 మంది పర్యాటకులను జిల్లా ఎస్పీ గాష్ ఆలం అప్రత్తత ద్వారా కాపాడుకోగలిగామని అన్నారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు రిస్క్ చేసుకుంటూ చాలా బాగా చేశారని అధికారులను అభినందించారు. మేడారం, ఊరట్టం, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్, కొండాయి, దొడ్ల, మల్యాల గ్రామాలు అధికంగా దెబ్బతిన్నవని, సోమవారం జరిగే క్యాబినేట్ మీటింగ్ దృష్టికి దొడ్ల బ్రిడ్జికి సంబంధించిన వివరాలు రోడ్ల కనెక్టివిటీ, పంట నష్టం, ఆస్తినష్టం, ప్రాణనష్టం తీసుకువెళ్తానని తెలిపారు. వరద భాదితులకు 10 రోజులకు సరిపడా రేషన్ బియ్యం అందించామని, బట్టలు, బెడ్ షీట్లు, వారి ఇండ్లు శుభ్రం చేయించడం, వంటకు కావలసిన నిత్యావసర సరుకులు సామాన్లు పరిస్థితులు మెరుగుపడే వరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.
జాతీయ రహదారి గట్టమ్మ నుండి పసర వరకు తాత్కాలికంగా రోడ్లు మరమ్మత్తు చేయడమైనదని, ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ రోడ్లు సమగ్ర నివేధిక రూపొందించామని తెలిపారు. తదుపరి కర్తవ్యాలపై ఉన్నతాధికారుల దృష్టి సారించి, తక్షణమే వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, పూర్తిగా ప్రజలు కోలుకునే వరకు పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని అన్నారు. మరికొన్ని రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. వివిధ శాఖల సమన్వయంతో అన్ని సహాయక చర్యలు నిర్వహించాలని అన్నారు. ప్రత్యేక అధికారులతో క్షేత్రస్థాయిలో సందర్శనలు జరుపుతూ సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News