ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఇంకా యాప్స్ ప్రమోషన్‌ను ఆపడం లేదు. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నవాళ్లు వేల మంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలే కాకుండా మరికొందరు బెట్టింగ్ టిప్స్ మాటున యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. టెలిగ్రామ్‌లో బెట్టింగ్ టిప్స్ పేరుతో ఛానళ్లు ఓపెన్ చేసి, అందులో మ్యాచ్ ప్రిడక్షన్స్ చెబుతూ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇలా ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి చాలా మంది యువతీ యువకులు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆటలు ఆడి తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
సరదాగా ఆడటం మొదలుపెట్టి, ఆ ఆటలకు బానిసై, పెయిడ్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ ఆడి దాచుకున్న డబ్బులను కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, అప్పులు కట్టలేక తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అప్పుల పాలైనటువంటి వారు తిరిగి కట్టలేక ఇంట్లో వాళ్లకు చెప్పలేక, తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంకొందరైతే అప్పులు తీర్చేందుకు దొంగలుగా, చైన్స్ స్నాచర్లుగా, సైబర్ నేరగాళ్లుగా మారుతున్నారు.
డబ్బుల కోసం ఇంట్లో వారిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. బంధాలు బంధుత్వాలను కూడా మరిచి ప్రాణాలను తీస్తున్నారు. ఈ పెయిడ్ గేమ్స్, ఆన్‌లైన్ గేమ్స్ బారినపడి నేటి యువత తన భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది. ఇందులో ఎక్కువగా 20 నుండి 35 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండడం అందరినీ ఆందోళన కలిగించే విషయం. ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి వారు ఇంటర్నెట్‌లో లేదా స్మార్ట్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌లను వెతికి అందులోని రమ్మి, ఐపిఎల్ బెట్టింగ్, ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్ అని ఎన్నో యాప్‌లను ఉపయోగిస్తూ ఆన్ లైన్‌లో సరదాగా మొదలుపెట్టిన ఆటలు, చివరికి వాటికి అలవాటు పడి జీవితాన్ని బలి తీసుకునే దిశగా వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా టెలిగ్రామ్‌లో క్రికెట్ అనలిస్టు పేరుతో ఒకరు, సౌత్ ఇండియా కింగ్ పేరుతో మరొకరు విపరీతంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ప్రిడక్షన్స్ ఇవ్వడం ద్వారా మీరు లాభాలు సంపాదించండంటూ తమ ఛానల్‌ను, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇలా టెలిగ్రామ్, వాట్సప్‌లో గ్రూపులు ఓపెన్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ను చాలా మంది ఓ వృత్తిగా ఎంచుకుంటున్నారు. కొందరికి అవి ఆన్‌లైన్ గేమ్స్ అని, క్రికెట్ బెట్టింగ్ అని తెలియకుండానే ఆ ఊబిలో చిక్కుకొని పోతున్నారు.
కరోనా సమయంలో పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు జరిగేవి. అలాంటి సమయంలో పాఠశాల విద్యార్థులు మొదలుకొని కళాశాలలో చదువుకునేటువంటి యువతీ యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధి లేనివారు ఈజీగా డబ్బులు సంపాదించాలనే యావతో ఆన్ లైన్ ఆటలకు అడిక్ట్ అయ్యి, వాటిపై ఇంట్రెస్ట్ చూపి, డబ్బులు డిపాజిట్ చేసి గేమ్ ఆడితే సంపాదించవచ్చు అన్న ఆశలతో అప్పులు చేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయి కష్టపడి సంపాదించిన దాన్నంతా కూడా పోగొట్టుకుంటున్నారు. బెట్టింగులను ఆర్గనైజ్ చేసే వాళ్ళు మొదట్లో కావాలనే కొంత డబ్బును యూజర్లు గెలుచుకునేలా చేస్తారు. దీంతో ఉత్సాహంగా మరింత సొమ్ము తెచ్చి గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ కడుతుంటారు. డబ్బులు పోగొట్టుకున్నా మళ్లీ రాకపోతాయని ప్రయత్నిస్తూ నిండా మునిగిపోతుంటారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో చాలా మంది యూత్ ఇలాగే నష్టపోయారు. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు వివిధ రకాల యాప్‌లు , వెబ్ సైట్‌ల ద్వారా బిజినెస్ చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్, పేటిఎం, ఫోన్ పేలో ద్వారా కూడా ఈ ఆటలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొన్ని సంస్థలు పెయిడ్ గేమ్స్ ద్వారా గేమర్స్‌కి మనీ ఇస్తున్నాయి.
ఆన్‌లైన్ రమ్మీ వంటి గేమ్‌లకు రూ. 50 నుంచి కూడా డబ్బు పెట్టే చాన్స్ ఉంటుంది. ముందు కొంత అమౌంట్ గేమ్ ఆడే వారి అకౌంట్‌లోకి వస్తుంది. దీంతో పాటు గేమ్‌లకు రివార్డ్ ఇస్తూ ఆకర్షిస్తుంటారు. టి 20లు, వన్ డేలు, ఐపిఎల్, ఆఖరికి టెస్ట్ మ్యాచ్‌లు, ప్రో కబడ్డీ, రమ్మీ, పేకాట వీడియో గేమ్స్ ఇలా ఆన్ లైన్ మోసానికి బలవుతూ ఉన్నారు. ఇవేకాక ఆన్ లైన్ స్పాట్, బ్లాక్ జాక్, బక్కట్ పోకర్, తీన్ పట్టి, అందరు బహార్, ఆన్‌లైన్ క్యాష్‌ను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యాప్‌లు, ఆన్‌లైన్‌లో మోసాలు పెరిగిపోయి, మొదట్లో రూపాయల్లో ఆశపెట్టి వందల్లో లాభాలు చూపి, తర్వాత వేళల్లో ఆశపెట్టి లక్షలు దోచేస్తున్నారు. నేటి యువతీ యువకులకు పలు రకాల ఆటలపై ప్రజల్లో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు నకిలీ యాప్‌లను సృష్టించి, వాటి ద్వారా కూడా సులువుగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ బెట్టింగ్ ఆన్ లైన్ గేమ్‌ల ద్వారా, బెట్టింగ్ యాప్‌ల ద్వారా, ఇంకా కొన్ని యాప్‌ల గనుక చూస్తే ఇంకా ముందుకు వెళ్లి వారే రుణాలు ఇస్తూ మళ్లీ డబ్బులు కట్టించి అదే గేమ్‌కు బానిసగా కూడా చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్లు రాకముందు ప్రశాంతమైన జీవితం గడిపినటువంటి వారు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు చైనా, సౌదీ అరేబియా, అరబ్ దేశాల నుంచి ఆపరేటింగ్ చేస్తుంటారు. ఇటీవల చత్తీస్‌గఢ్ లో వెలుగు చూసిన మహాదేవ యాప్ కేసులో ఇదే విషయం తేటతెల్లమైంది. ప్రముఖులతో యాడ్స్ ఇప్పించడం అమాయకులను ముగ్గులోకి దించడం ద్వారా డబ్బులు వసూలు చేయడం, మొత్తంగా ఆటలకు బానిసలు చేయడం నిత్యకృతమైంది. ఇటీవల కాలంలో ఒక కలెక్టర్ దగ్గర పనిచేసేటువంటి గన్‌మెన్ సైతం అప్పుల ఊబిలో చిక్కి తన కుటుంబంతో సహా ప్రాణాలను కోల్పోయారు. ఇలా ఆన్‌లైన్ మోసాలతో దేశంలో కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతున్నది.
ఈ దారుణాలు జరుగుతున్నటువంటి క్రమంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం తగ్గించడం మేలు. ఖాళీగా ఉంటూ ఏదైనా చూస్తున్న కొద్దీ ఏవేవో ప్రకటనలు, ఆకర్షించే బొమ్మలు, ఆటలు, మన డిస్‌ప్లే మీద ఆకర్షిస్తూ ఉంటాయి. మరి అలాంటి తరుణంలో వాటి జోలికి పోకుండా వాటిని యాపులను డౌన్‌లోడ్ చేసుకోకుండా ఉంటే మంచిది. వాటి మీద టచ్ చేస్తే ఆ యాప్‌లు డౌన్‌లోడ్ అయి మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు గానీ లేదా డబ్బులు పెట్టి నష్టపోయేటువంటి పరిస్థితి గానీ వస్తుంది.
దానివల్ల ఇంట్లో అనర్ధాలు, ఇబ్బందులు, అప్పుల గొడవలు, మనస్పర్దలు, ప్రశాంతత లేక ఆత్మహత్యల ఆలోచనలు వచ్చే ప్రాణాలనే బలి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్‌లో కానీ, ఇంటర్నెట్‌లో కానీ తెలిసినటువంటి యాపులను వినియోగించడం మంచిది. తెలియని యాప్‌ల జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ బారిన పడి లక్షల్లో అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ఘటనలు అధికంగా జరుగుతున్న వేళ ఈ యాప్స్ ప్రమోషన్‌తో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అలాగే వారిపై చర్యలు తీసుకొని, ఉజ్వల భవిష్యత్తు వున్న భవితను కాపాడుదామని ఆశిద్దాం.
మోటె చిరంజీవి
99491 94327