Thursday, January 23, 2025

బ్రిటన్ నూతన ప్రధాని

- Advertisement -
- Advertisement -

          Atrocities against women and children have increased

 

కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలుగా, 56వ ప్రధానిగా 47 ఏళ్ల లిజ్‌ట్రస్ ఎన్నికతో ఆమె బ్రిటన్‌కు మూడో మహిళా ప్రధాని అవుతున్నారు. ఇంతకు ముందు మార్గరెట్ థాచర్, థెరెసా మే బ్రిటన్‌కు మహిళా ప్రధానులుగా చేశారు. వారు కూడా కన్సర్వేటివ్ పార్టీకి చెందిన వారే. ట్రస్ ఎన్నికకు ముందు రెండు మాసాల పాటు పాలక కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. మాజీ ప్రధాని అవుతున్న బోరిస్ జాన్సన్ ఈ కాలంలో ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నిక ప్రక్రియలోని క్లిష్టతను ఆసరా చేసుకొని ఆయన తక్షణమే పదవిని వీడడానికి నిరాకరించారు. వాస్తవానికి గత జులైలోనే బోరిస్ జాన్సన్ తన రాజీనామా సంకల్పాన్ని ప్రకటించారు.

బ్రెగ్జిట్ సంక్షోభం నుంచి బ్రిటన్‌ను గట్టెక్కించిన ప్రధానిగా పేరు సంపాదించుకున్నప్పటికీ వ్యక్తిగత ఆరోపణల వల్ల కన్జర్వేటివ్ పార్టీలో అభిమానాన్ని కోల్పోయి జాన్సన్ తప్పుకోవలసి వచ్చింది. అధికారికంగా రాజీనామా సమర్పించడానికి జాన్సన్ నేడు రాణి ఎలిజబెత్‌ను కలుసుకుంటారు. ఆ వెంటనే లిజ్‌ట్రస్ నూతన ప్రధాని కావడానికి దారి ఏర్పడుతుంది. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో భారత సంతతికి చెందిన రుషి సునాక్ చివరి వరకూ పోటీలో ఉండడం గమనించవలసిన విషయం. ఒక దశలో సునాక్ ప్రధాని కావడం తథ్యమని అనుకున్నారు. ఆయన విప్రో అధినేత నారాయణ మూర్తి అల్లుడు. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి మొత్తం 8 మంది పోటీపడ్డారు. మొదటి రౌండ్ లో గల 8 మంది రెండో రౌండ్ ముగిసే సరికి ఆరుగురయ్యారు. మూడో రౌండ్‌కి ఐదుగురు, నాలుగో రౌండ్‌కి నలుగురై, ఐదవ రౌండ్‌కు ముగ్గురే మిగిలారు. ఐదవ రౌండ్‌లో 137 ఓట్లతో రుషి సునాక్ ప్రథమ స్థానంలో, 113 ఓట్లతో లిజ్‌ట్రస్ ద్వితీయ స్థానంలో వున్నారు.

వీరిద్దరి మధ్య జరిగిన చివరి విడత ఎన్నికలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన దేశ వ్యాప్త సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ ఎన్నికలో 81326 (57.4%) ఓట్లతో లిజ్‌ట్రస్ మొదటి స్థానంలో, 60399 (42.6%) ఓట్లతో రుషి సునాక్ రెండో స్థానంలో వచ్చారు. మొత్తం 82.6 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో లిజ్‌ట్రస్ విదేశాంగ మంత్రిగా పని చేశారు. 2015 నాటి ఎన్నికల దగ్గరి నుంచి లెక్కిస్తే లిజ్‌ట్రస్ బ్రిటన్‌కు నాలుగవ కన్జర్వేటివ్ ప్రధాని అవుతున్నారు. ట్రస్ కూడా బ్రెగ్జిట్‌ను గట్టిగా సమర్థించారు. వెన్న దిగుమతిని తీవ్రంగా వ్యతిరేకించిన ట్రస్ ఇంటింటికీ సుపరిచితురాలే. ఆర్థిక మంత్రిగా చేసిన రుషి సునాక్ మాదిరిగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై పార్టీలో తిరుగుబాటును ట్రస్ సమర్థించలేదు.బ్రిటన్ వరుసగా సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. బ్రెగ్జిట్ సంక్షోభాన్ని అతి కష్టం మీద గట్టెక్కిన తరువాత ఇప్పుడు సుదీర్ఘమైన మాంద్యాన్ని చవిచూస్తున్నది. 10.1 శాతం వద్ద జులైలో ద్రవోల్బణం ఆకాశ విహారం చేసింది. ప్రజల జీవన వ్యయం దుర్భరమైన స్థాయికి చేరింది. చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఇంధన బిల్లులు చెల్లించడం అసాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

ఈ భయం నుంచి వారిని కాపాడుతానని ట్రస్ ఆదివారం నాడు ఒక టివి ఇంటర్వూలో వాగ్దానం చేశారు. పెంచిన పన్నులను, ఇతర లెవీలను తగ్గిస్తానని చెప్పారు. పెరుగుతున్న ఇంధన బిల్లులను తగ్గించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని వారం రోజుల్లో ప్రకటిస్తానని ట్రస్ హామీ ఇచ్చారు. జిడిపి పరంగా బ్రిటన్ ఇండియా కంటే వెనుకబడిపోయింది. ఐదవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా తనకు గల స్థానాన్ని భారత దేశానికి వదులుకున్నది.ఈ పరిస్థితుల్లో బ్రిటన్ జిడిపిని పెంచవలసిన బాధ్యత ట్రస్‌పై పడుతుంది. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్‌ట్రస్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ఆమె నాయకత్వంలో భారత బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రస్ గతంలో ఇండియాను అనేక సార్లు సందర్శించారు.

మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌తో వర్చువల్ చర్చల్లో పాల్గొన్నారు. భారత దేశం ఒక అతిపెద్ద అవకాశాల దేశమని కొనియాడారు. భారత బ్రిటన్ పొడిగించిన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం (ఇటిపి)పై ట్రస్ సంతకం చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడగలవనే ఆశాభావాన్ని ఆ సందర్భంగా వ్యక్తం చేశారు. బ్రిటన్‌కు ఎన్ని కష్టాలున్నా పరిమిత జనాభా (68 కోట్లు), అత్యధిక శాతం ప్రజలు (78 శాతం) పని చేస్తున్న వారు కావడం దానికున్న మంచి లక్షణాలని చెప్పవచును. సమర్థుడై వుండి కూడా వ్యక్తిగత శీల సమగ్రత లోపం వల్ల అధికారాన్ని కోల్పోయిన బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధాని అవుతున్న ట్రస్ బ్రిటన్‌కు మరింత సమర్థవంతమైన పరిపాలన అందించి మరో సమర్థురాలైన ప్రధానిగా గుర్తింపు పొందాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News