న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని , భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ తాజాగా 94 వ వసంతం లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేంద్ర మంత్రులు అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం నేరుగా అద్వానీ నివాసానికి వెళ్లిన నేతలు … పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం అనేక విషయాలపై ఆయనతో ముచ్చటించారు. అంతకు ముందు ప్రధాని మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా. ప్రజల సాధికారిత, మన సాంస్కృతిక గొప్పతనాన్ని మరింత పెంపొందించేందుకు చేసిన కృషికి గాను యావత్ దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుందని ప్రధాని మోడీ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ అద్వానీ సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి మార్గనిర్దేశం చేసిన విషయాన్ని రాజ్‌నాధ్ గుర్తు చేశారు. అత్యంత మేథస్సు, దూరదృష్టి కలిగిన నాయకుల్లో అద్వానీ ఒకరని కీర్తించారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ఆయన చేసిన కృషిని కొనియాడారు. బిజెపిని ప్రజల్లోకి తీసుకుపోవడంతోపాటు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంలో అద్వానీ ఎంతో కృషి చేశారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెసి నడ్డా ప్రశంసించారు. తొంభై ఏళ్ల వయసు దాటిన అద్వానీ కోట్ల మంది కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు.