లక్షలాది రూపాయలు విలువచేసే హైఎండ్ స్మార్ట్‌ఫోన్లను దొంగిలించినందుకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఉద్యోగిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని ఓ అధికారి మంగళవారం తెలిపారు. నిందితుడిని మోను అలియాస్ నిఖిల్ కుమార్(28)గా గుర్తించారు. దొంగిలించిన మొత్తం 75 స్మార్ట్‌ఫోన్లలో 36 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్గో సర్వీసెస్ వద్ద సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తున్న సంజయ్ యాదవ్ ఫిర్యాదు చేశాక విషయం వెలుగు చూసింది. ఫిర్యాదు ప్రకారం కంపెనీ 280 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు ఉన్న పివిసి బాక్సులను నోయిడా ఫేస్ రెండు గోడౌన్ నుంచి ఇందోర్ స్టోర్‌కు జనవరి 27న డిస్పాచ్ చేసింది. అయితే విమానం ఆగమనం(అరైవల్) తర్వాత 75 ఫోన్లు ఉన్న బాక్స్ మిస్సయింది.
సిసిటివి ఫుటేజ్ చూసినా అంతుచిక్కలేదు. దాంతో పరిశోధకులు టెక్నికల్ నిఘాతో దొంగిలించిన పరికరాలను గుర్తించారు. ‘ఓ కొనుగోలు దారు తూర్పు పటేల్ నగర్‌లోని మొబైల్ డీలర్ సుమన్ కుమార్ నుంచి కొనుగోలు చేయడంతో కేసులో పరోగతి లభించింది. అతడిని ప్రశ్నించాక సుమన్ తాను 27 ఫోన్లను మరో డీలర్ అరుణ్ శర్మ నుంచి రూ. 26 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇన్వాయిస్‌లు లేకుండా ఫోన్లు అమ్మినందుకు కస్టమర్లు వాటిని సుమన్‌కు వాపస్ చేశారు. అతడు అరుణ్ శర్మకు వాపస్ చేశాడు’ అని అదనపు పోలీస్ కమిషనర్(ఐజిఐ) ఉషా రంగ్నాని తన ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించాక నిఖిల్ కుమార్ నేరాన్ని అంగీకరించాడు. అతడు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలో గత రెండేళ్లుగా లోడర్‌గా పనిచేస్తున్నాడు.