Monday, December 23, 2024

దా‘రుణ’ యాప్‌లు!

- Advertisement -
- Advertisement -

రోజురోజుకు రుణ యాప్‌ల అరాచకాలు పెరుగుతున్నాయి. తద్వారా ఎంతోమంది బాధితులు ఈ రుణ యాప్‌ల మోసాలకు బలవుతున్నారు. అధిక వడ్డీలను వసూలు చేస్తున్న ఈ అక్రమ యాప్‌ల బారినపడి అనేక మంది తమ ప్రాణాలను తీసుకోవడమే కాకుండా అప్పుల పాలవుతున్నారు. గడిచిన ఐదేళ్లలో రుణ (లోన్) యాప్‌ల వ్యాపారం రెట్టింపు కావడంతో వాటి నిర్వాహకుల వేధింపులు కూడా పెరిగాయి. అప్పు తీసుకున్న వారి ఫోన్ నెంబర్లు, వారి ఛాయాచిత్రాలు, వారు ఎక్కడున్నారన్న సమాచారం, వారికి సంబంధించిన వీడియోలతో పాటు, తదితర వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, వారి నెంబర్లకు పంపించి, బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

చట్టవిరుద్ధ రుణ యాప్‌లు అధిక వడ్డీరేట్లు వసూలు చేయడం, డబ్బు రికవరీ చేయడానికి బెదిరింపులకు పాల్పడడం వంటి అంశాలపై నిత్యం వివిధ మాధ్యమాలలో ద్వారా చూస్తున్నాం. ఈ రుణ యాప్‌లు చాలా ప్రమాదకరం. రుణయాప్‌లు లోన్ ఇచ్చే ముందు మనకు సంబంధించిన అన్ని వివరాలు తీసుకుంటారు. వీటికి ఎలాంటి అనుమతులు ఉండవు. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని క్షణాల్లో రుణాలు అందిస్తూనే అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. రుణాలు చెల్లించడంలో విఫలమైన వారిపై బెదిరింపులకు పాల్పడుతూ వారి ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాయి. ఇలా వ్యక్తిగత సమాచారం సేకరించడం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాక భద్రతకు ప్రమాదకరమని కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికీ రుణయాప్‌ల దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం 600కు పైగా ఫేక్ రుణ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. రుణాల కోసం ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు యాప్ పేరు, దాని రేటింగ్, యాప్ స్టోర్‌లో సమీక్షలు, ఇతర వివరాలను పరిశీలించాలి. భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి పొందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్ బిఎఫ్‌సి) లతో ఒప్పందం కుదుర్చుకున్న యాప్‌లు రుణాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ మూతపడిన ఎన్‌బిఎఫ్‌సిలతో పొత్తు పెట్టుకుని ఆన్‌లైన్ రుణాల పేరిట అడ్డగోలుగా దందాలు చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులు, యువతకు ఎలాంటి హామీ లేకుండా తక్కువ అప్పులు ఇచ్చి అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి.

వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు వారు వారి అమూల్యమైన ప్రాణాలను తీసుకుంటున్నారు. రుణ యాపుల నిర్వాహకుల వేధింపులతో 2021లో దేశ వ్యాప్తంగా 68 మంది ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణలో ఈ రుణ యాపుల వేధింపులతో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఏడాదిలోనే 2500 ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో నమోదు కాగా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు విచారణ చేపట్టి వీటి వెనుక కీలక పాత్ర పోషిస్తున్న చైనా జాతీయులను కూడా అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతూ రూ. 903 కోట్లు కొట్టేసి అడ్డదారిలో చైనాకు పంపిన ఇద్దరిని పట్టుకున్న ఉదంతం హైదరాబాదులో వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో రుణ యాపుల కార్యకలాపాలు 10% ఉండగా, భారత్‌లో 45%, చైనాలో 28%, ఫిలిప్పీన్స్, మలేషియా, థాయిలాండ్లలో 10% ఉన్నాయి. యూట్యూబ్ వీడియోల లింకుల ద్వారా, ప్లే స్టోర్‌ల ద్వారా, ఈ యాపుల పంపించి కొన్ని కోట్లు కొల్లగొట్టిన వారు ఉన్నారు.

వారిలో అధిక శాతం చైనా దేశానికి చెందినవారు. ఆన్‌లైన్ మోసాలు రుణయాపుల ద్వారా సంపాదించిన డబ్బులను దొంగ పత్రాలతో ఏర్పాటు చేసిన కంపెనీల ద్వారా విదేశాలకు తరలించి, అక్కడి నుండి చైనా కు తరలిస్తున్నారు. రుణ యాపుల ద్వారా అప్పు తీసుకున్న వారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగాని, తల్లిదండ్రులకు గాని, భార్యా బిడ్డలకు గాని తెలియజేయాలి. ఒత్తిళ్లకు తలొగ్గి అఘాయిత్యాలు చేసుకోకుండా రుణయాప్‌ల వారు ఒత్తిడి తెస్తే పోలీసులను, సైబర్ క్రైమ్ వారిని సంప్రదించి ఫిర్యాదు చేయాలి. రుణయాప్‌ల ద్వారా అప్పులు తీసుకోవడం మాని ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం పని చేసే సంస్థల వద్ద మాత్రమే అప్పు తీసుకోవాలి. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ కాలంలో జాతీయ సైబర్ నేరాల ఫోరెన్సిక్ సేవలు, సైబర్ క్రైమ్ పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్‌లైన్ మోసాలను నియంత్రించడంలో పాత్ర వహిస్తున్నారు. ప్రాణం ఉంటే అప్పు ఈ రోజు కాకపోతే రేపు కూడా తీర్చవచ్చు. కానీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి అఘాయిత్యాలు చేసుకోకుండా, మనోనిబ్బరంతో ఉండి మీ కుటుంబానికి బాసటగా నిలవండి.

మోటె చిరంజీవి
9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News