దా‘రుణ’యాప్‌ల నిందితుల కోసం రంగంలోకి సైబర్‌క్రైం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ లోన్ ఆప్స్ కంపెనీల డైరెక్టర్లు చైనాకు పారిపోవడంతో వారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా చైనా కంపెనీలు తెలివిగా ఇండియాకు చెందిన పలువురిని డైరెక్టర్లుగా నియమించుకుని భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా తమ మీదకు రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయి తే చైనాకు చెందిన కొందరితో ఇండియాకు చెందిన వాళ్ళ డబ్బుల కోసం ఆశ పడి వ్యాపారంలో కీలక పాత్ర వహించడంతో పాటు ఇండియన్లు డైరెక్టర్లుగా యమితులయ్యారు. చైనా భాగస్వామ్యంలో ఆన్లైన్ రుణ వ్యాపారం చేసే 16 కంపెనీలపై పోలీసులు దాడులు చేసి మూసివేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీలో ఉన్న అసలు డైరెక్టర్లను పట్టుకుంటే నిజాలు బయటకి వస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా ల్యాంబోను అరెస్టు చేయడంలో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా అతడు చైనాకు పారిపోయేవాడని, చైనాకు పారిపోయేందుకు విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా ల్యాంబో హైదరాబాద్‌లోని మూడు కాల్ సెంటర్లు, బెంగళూరు, గురుగ్రామ్‌లలో కాల్ సెంటర్‌కు చీఫ్ వ్యవహరిస్తున్న ట్లు గుర్తించిన పోలీసులు ల్యాంబో భారత్‌లోని కాల్ సెంటర్లకు చీఫ్ అని పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా చైనాలోని ప్రధాన నిందితులు, ఇక్కడ కాల్ సెంటర్లలో రిక్రూట్ చేసుకున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు విచారణలో ల్యాంబో వెల్లడించాడు. ఆన్లైన్ యాప్‌ల కేసులకు సంబంధించి విచారణ చేపడుతున్న పోలీసులు చైనాకు చెందిన వ్యక్తులు ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని, కాగా ఖాతాలు మా త్రం ఇండియాకు చెందిన వ్యక్తుల పేరిట నడుస్తున్నాయని గుర్తించారు. ఈక్రమంలో చైనాలో తలదాచుకు న్న అసలు నిందితులను ఇండియాకు తిరిగి రప్పించేందుకు సైబర్ క్రైం పోలీసులు పలువురు నిందితులకు కేంద్రం సహాయంతో రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది.
మరోసారి ఆర్బిఐ సీరియస్
ఆన్లైన్ లోన్ యాప్‌లపై బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సీరియస్ అయ్యింది. చట్టానికి వ్యతికంగా ఆన్లైన్ మనీ యాప్‌లు సృష్టించిన సంస్థలు, వాటిని నిర్వహించే వారిపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఈక్రమంలో ఆర్బిఐలో రిజిస్టర్ చేసుకున్న సంస్థలు మాత్రమే రుణాలు ఇవ్వాలని ఆర్బిఐ స్పష్టం చేసింది. ఆర్బిఐ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహించే ఆన్లైన్ యాప్‌లపై వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించింది. ఇదిలావుండగా ఆన్లైన్ మనీ లోన్ యాప్‌లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆర్బిఐకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈక్రమంలో లోన్‌యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో స్పందించిన ఆర్బిఐ రుణ యాప్‌లపై నమోదైన కేసుల అంశంపై మరోసారి స్పందించింది. ఆర్బిఐ, ఎన్‌బిఎఫ్‌సికి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన యాప్స్ అధిక వడ్డీలు, ఇతర రుసుముల తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. సులభంగా రుణాలు ఇస్తున్న వారి మాయలో ప్రజలు పడొద్దని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలు, డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఇటువంటి మోసాలపై sachet.rbi.org.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఆర్బిఐ సూచించింది.
Loan apps Directors Escaped to China