Sunday, January 19, 2025

అప్పులపై ఆచితూచి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః దేశంలో ద్రవ్యలోటును తగ్గించడానికి, ఆర్ధిక సంక్షోభం బారిన పడకుండా రాష్ట్రాలను కాపాడేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టు సడలించిందని, అందుకే రుణాల కోసం ధరఖాస్తు చేసుకునే రాష్ట్రాల విషయంలో అడిగిందే తడవుగా అనుమతులిస్తూ వస్తోందని అధికారవర్గాల సమాచారం. కోవిడ్-19 మూలంగా ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోకుండా, రాష్ట్రాల ద్రవ్యలోటు, రెవెన్యూలోటు పడిపోకుండా రుణాల పరిమితులను సడలించాలని ఆర్‌బిఐ నిర్ణయం తీసుకొందని, అందుకు తగినట్లుగా రుణాలు కావాలని అడిగిందే తడవుగా ధరఖాస్తు చేసుకొన్న రాష్ట్రాలకు ఆర్‌బిఐ అనుమతులు ఇస్తోందని కొందరు సీనియర్ అధికారులు తెలిపారు. ఈ తాజా నిర్ణయాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలూ సద్వినియోగం చేసుకొంటున్నాయని, కానీ ఒక్క తెలంగాణ ప్రభుత్వమే రుణాలు తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

గడిచిన ఆరు నెలలుగా ప్రతి రాష్ట్రానికీ సెక్యూరిటీ బాండ్ల వేలం, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రుణాలను సేకరించుకోవడానికి కూడా అనుమతులు ఇస్తూనే ఉన్నారని వివరించారు. కానీ ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని మాత్రం 4 శాతం నుంచి 5 శాతానికి పెంచాలనే రాష్ట్రాల డిమాండ్‌ను అమలు చేయకపోయినా, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని సవరించకుండానే ఆ మేరకు రుణాల రూపంలో నిధుల సేకరణకు ఆర్‌బిఐ అనుమతులు ఇస్తూ పట్టు సడలించిందని వివరించారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్ట పరంగా వచ్చే రుణాలను కూడా తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు సమాచారం. ఆర్‌బిఐ పట్టు సడలించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా 2022-23వ సంవత్సరంలో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ విధించిన ఆంక్షలను ఇప్పటికీ రద్దు చేయకపోవడంతోనే తెలంగాణ ప్రభుత్వం రుణాల కోసం ఇండెంట్‌లను పెట్టడంలేదన్న భావన ఉంది.

2022-23వ సంవత్సరం ఏప్రిల్‌లో కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగానే తెలంగాణ రాష్ట్రానికి రుణాల సేకరణ పరిధులను తగ్గించామని చెప్పారని, దాంతో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ప్రతి ఏటా 4 శాతం వరకూ రుణాలను సేకరించుకునే పరిమితులను ఏకంగా 3.5 శాతానికి తగ్గించడంతో తెలంగాణ రాష్ట్రం వేల కోట్లల్లో నష్టపోయిందని వివరించారు. ఇప్పటికీ ఆ ఆంక్షల ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖగానీ, ఆర్‌బిఐగానీ రద్దు చేయలేదని, ఆ ఉత్తర్వులు అమలులో ఉండటంతోనే రుణాలకు ధరఖాస్తు చేసుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోనే నిధులను సమీకరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండవచ్చునని ఆ అధికారులు వివరించారు.
5%కి పైగా రుణాలకు అనుమతులిస్తున్న ఆర్‌బిఐ..?
ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట ప్రకారం రాష్ట్రాలు రుణాల రూపంలో నిధులను సేకరించుకోవడానికి జిఎస్‌డిపిలో నాలుగు శాతానికి మించకుండా రుణాలు పొందవచ్చునని పరిమితులు విధించినప్పటికీ ఆచరణలో మాత్రం 5 శాతానికి మించి కూడా రుణాలు తీసుకునేందుకు ఆర్‌బిఐ అనుమతులు ఇస్తూనే ఉందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జమ్ము-కాశ్మీర్ వంటి రాష్ట్రాలకు కూడా చట్ట పరిధిని, పరిమితిని మించి కూడా కొత్త రుణాలకు ఆర్‌బిఐ అనుమతులు ఇస్తూనే వస్తోందని, ఈ రాష్ట్రాలన్నీ ఎప్పుడో ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిధులను దాటిపోయి అప్పులు చేశాయని వివరించారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి 4 శాతం ఉండగా మెజారిటీ రాష్ట్రాలు 5 శాతానికి మించిపోయాయని, అయిదు రాష్ట్రాలైతే ఏకంగా ఆరు శాతం వరకూ అప్పులు చేశాయని తెలిపారు.

కానీ ఆర్‌బిఐ, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖల ఆంక్షల మూలంగా తెలంగాణ రాష్ట్రం సుమారు 20వేల కోట్ల రూపాయల నిధులను నష్టపోయిందని వివరించారు. దాంతో తెలంగాణ రాష్ట్ర రుణాల సేకరణకు పూర్తిగా బ్రేకులు పడ్డాయని, ఈ ఆంక్షల మూలంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులను సేకరించుకునే పనిలో పడ్డామని, దాంతో రుణాలు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్ధికంగా నిలదొక్కుకోగలదని ఇటు కేంద్రానికి, అటు ఆర్‌బిఐ పెద్దలకు ఆచరణాత్మకంగా నిరూపించినట్లయ్యిందని ఆ అధికారులు వివరించారు. అంతేగాక కేంద్రంలోని బిజెపి సర్కార్ విధించిన ఆంక్షల మూలంగా ప్రత్యామ్నాయ మార్గాలతో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను అధ్యయం చేసేందుకు వీలుకలిగిందని, ఒకవిధంగా కేంద్రం విధించిన ఆంక్షలు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, రెవెన్యూశాఖల సత్తా ఏమిటో నిరూపితమయ్యిందని అన్నారు.

ఇప్పటికైనా సమయం మించి పోలేదని తెలంగాణ ప్రభుత్వం అవసరమైన నిధుల సమీకరణకు ఇండెంట్ పెడితే అనుమతులు ఇస్తామని ఆర్‌బిఐలోని కొందరు సీనియర్ అధికారులు పరోక్ష సంకేతాలు ఇచ్చారని వివరించారు. అయితే రుణ పరిమితిని 3.5 శాతానికి తగ్గించిన ఉత్తర్వులను కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ రద్దు చేయకపోవడంతోనే తెలంగాణ ప్రభుత్వం రుణాల రూపంలో అదనపు నిధుల సేకరణకు ఇండెంట్ పెట్టడంలేదని తాము భావిస్తున్నామని తెలిపారు. అందుకే నెలకు ఆరు వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేవలం మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలకే సెక్యూరిటీ బాండ్ల వేలంలో నిధుల సమీకరణకు మాత్రమే పరిమితం అవుతోందని వివరించారు. ఒకవేళ రుణాల కోసం దరఖాస్తు చేసుకొన్నా రాజకీయపరమైన కక్ష సాధింపులో భాగంగా తెలంగాణకు అనుమతులు ఇవ్వకపోవచ్చుననే ఉద్దేశంతో కూడా ఇండెంట్ పెట్టకపోవడానికి మరో ప్రధానమైన కారణమని తెలిపారు.

మొత్తంమీద కారణాలు ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం ఏటా 20 వేల కోట్ల రూపాయలను నష్టపోతున్నారని వివరించారు. తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిమితిని 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించిన ఉత్తర్వులను కేంద్రం ఇంకా రద్దు చేయకుండా నిర్లక్షం వహించడంతోనే రాష్ట్ర ప్రజల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంతటి ప్రేమ, అభిమానాలున్నాయో ఇట్టే అర్ధంచేసుకోవచ్చునని అంటున్నారు. “కేంద్రం ఆంక్షల ఉత్తర్వులను రద్దు చేయదు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిధుల కోసం కేంద్రం ఆంక్షలకు తలొగ్గరు” అందుకే ఈ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రంపై మండిపడుతున్నారు. అందుకే కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై తెలంగాణ ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఆగ్రహావేశాలతో ఉన్నారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News