Monday, January 20, 2025

ఎఫ్ఆర్ బిఎం పరిధిలోనే రుణాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆ ర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు బడ్జెట్‌లో కృషి చేశామని ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు నిధులు అందని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితి రాకుండా వాస్తవ బడ్జెట్ రూపొందించామని వెల్లడించా రు. సామాజిక సమానత్వంలో భాగంగా బ డ్జెట్‌లో కేటాయింపులు జరిపామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కావాల్సిన నిధులను సమకూరుస్తామని అన్నా రు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని, ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయక తప్పట్లేదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఏడోరోజులో భాగంగా గురువారం బడ్జెట్‌పై చర్చకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.

వాస్తవాలను విస్మరించి గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఏటా బడ్జెట్‌ను 20 శాతం పెంచుకుంటూ పోయారని భట్టి విక్రమార్క విమర్శించారు. గతంలో మాదిరిగా 20 శాతం అధికంగా బడ్జెట్ పెడితే ప్రమాదమని, వాస్తవాలకు దూరంగా భ్రమలు కల్పిస్తే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. బడ్జెట్, బడ్జెట్‌యేతర రుణాలను ఎఫ్‌ఆర్‌బిఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. గతంలో కేటాయింపులకు నిధులు అందని పరిస్థితి ఉందని, పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ రూపొందించామని తెలిపారు. ఆదాయం, వ్యయం మేరకే బడ్జెట్ ఉండాలనే ఆలోచనతో వాస్తవ పద్దును ప్రవేశపెట్టామని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులకు 5 శాతానికి మించి తేడా లేకుండా చూడాలని, గతంలో తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లుగా ప్రవేశపెడితే ఈసారి బడ్జెట్ రూ.2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామని చెప్పారు. రైతుభరోసా కోసం బడ్జెట్‌లో రూ.15,075 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.7,740 కోట్లు కేటాయించామని చెప్పారుజ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తామని, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ కోసం రూ.2418 కోట్లు, రూ.500కు గ్యాస్ సిలిండర్ కోసం రూ.723 కోట్లు, సాంఘిక సంక్షేమం కోసం రూ.5.815 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం రూ.2,800 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ కోసం రూ.40వేల కోట్లు కేటాయించామని వివరించారు. ఈసారి బడ్జెట్ తగ్గిస్తున్నారని తమను చాలా మంది అడిగారని, ఆదాయం, వ్యయం మేరకు బడ్జెట్ ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సభ్యులు సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో పదేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల కోసం యువత ఎదురుచూశారని, తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాల నియామక పత్రాలు ఇస్తున్నామని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సికి ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరు చేశామని, గ్రూప్-1లో 503 పోస్టులకు అదనంగా 64 పోస్టులు మంజూరు చేశామని వివరించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం కోసం విధి విధానాల రూపకల్పన చేస్తున్నామని, మార్గదర్శకాలు పూర్తి కాగానే నిధుల కేటాయింపు ఉంటుందని చెప్పారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రక్రియకు కావాల్సిన నిధులు విడుదల చేస్తామని, కొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించారు. డబుల్ బెడ్‌రూం ఆలాట్‌మెంట్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పేరుకుపోయిన గత బకాయిలను ఆర్ధిక శాఖలో క్లియరెన్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. పాతబస్తీలో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రానికి ధరణి గుది బండగా మారిందని, దీనిని సరిచేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకున్నారని,కానీ 2018 నుంచి విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ క్లియర్ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.

ప్రధాని ఫోటో పెట్టేందుకు మాకు ఎలాంటి అభ్యతంరం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫెడరల్ స్పూర్తి ఉందని, తప్పనిసరిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాష్ట్ర బిజెపి నేతలు ఒక మాట చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలకు ప్రధానమంత్రి ఫోటో పెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యతంరం లేదని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News