Friday, December 20, 2024

కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: కవిత

- Advertisement -
- Advertisement -
  • కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
  • ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
  • పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అమలుకు బీసీ మేధావులు గళమెత్తాలి
  • అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటుపై ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి
  • వరంగల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వరంగల్: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆగమాగం నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.

మంగళవారం వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిహార్ లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, జడ్పీటీసీలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ రీత్యా పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని పునరుద్ఘాటించారు. అలాగే, బీసీల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు.

ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామా జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని అన్నారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News