Monday, December 23, 2024

ఉద్యోగాలకు ‘స్థానికం’ పరిష్కారం కాదు

- Advertisement -
- Advertisement -

కర్ణాటక ప్రభుత్వం స్థానికులకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్ పరిమితి విధించే బిల్లును అమలులోకి తేడానికి ప్రయత్నించి యూటర్న్ కావలసి వచ్చింది. భవిష్యత్ పరిణామాలను అంచనా వేయకుండా ముందుచూపు లేకుండా ప్రయత్నించడమే ఉద్యోగాల విషయంలో కల్లోలం రేపింది. స్థానికులకు ప్రైవేట్ సంస్థలు మానేజ్‌మెంట్ కేటగిరిలో 50%, మానేజ్‌మెంట్ కాని కేటగిరిలో 75% ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్దేశిస్తూ బిల్లు ను రూపొందించింది. అంతేకాదు ప్రైవేట్ సంస్థలన్నీ ఉద్యోగులను కాంట్రాక్ట్ కింద తీసుకున్నప్పుడు గ్రూప్ సి, డి ఉద్యోగాలన్నీ కన్నడిగులనే తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది.

వాస్తవానికి ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను ఈ విధంగా హైర్‌కు తీసుకోడానికి నిర్ణయించే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోడానికి వీలు లేదు. అయితే ఈ బిల్లులోని రెండు క్లాజ్‌లు బ్యూరోక్రాట్లు ప్రైవేట్ సంస్థలపై పెత్తనం చేయడానికి వీలు కల్పిస్తున్నాయి. ఒక క్లాజ్ ప్రకారం ఉద్యోగుల నియామకాల్లో దర్యాప్తు చేసిన తరువాతనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం. రెండోది సంస్థలు ఉద్యోగులను నియమించేటప్పుడు ఆయా ఉద్యోగుల రిపోర్టులను తనిఖీ చేయడానికి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం. ఇలాంటి ప్రతిపాదన ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అమలులోకి తెస్తే ప్రైవేట్ రంగం రిక్రూట్‌మెంట్ కమిటీలపై ప్రభుత్వ అధికారులు అజమాయిషీ తప్పనిసరి అవుతుంది. ఇదొక విధంగా ఇన్‌స్పెక్టర్ రాజ్ విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకొచ్చినట్టు అవుతుంది.

ఈ చర్య అసంబద్ధం. దూరదృష్టి లోపించే గుడ్డితనం. ఇది ఎవరైనా, ఎక్కడికైనా నచ్చిన చోట ఉద్యోగాలు వెతుక్కుంటూ స్వేచ్ఛగా ప్రయాణించే ప్రాథమిక హక్కుకు వ్యతిరేకం.ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబడినవారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ తప్పనిసరి. కానీ భాషాపరంగా మెజారిటీ వర్గానికి రిజర్వేషన్ కల్పించడానికి ప్రయత్నించడం అసంబద్ధం. తమకు కావలసిన అర్హులైన ఉద్యోగులను నియమించుకునే స్వేచ్ఛ ఆయా సంస్థలకు లేనప్పుడు కర్ణాటకనే ప్రైవేట్ సంస్థలు ఎందుకు ఎంచుకోవాలన్న ప్రశ్న తలెత్తక మానదు. ఈ విధంగానే హర్యానా ప్రభుత్వం చట్టం తీసుకువస్తే కోర్టు రద్దు చేసిన గుణపాఠం కర్ణాటక ఇంకా నేర్చుకున్నట్టు లేదు. హర్యానా ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగాలు కల్పించడం కోసం 2020లో ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. ప్రైవేట్ సెక్టార్‌లోని ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ స్థానికులకే కల్పించింది. వారికి నెలవారీ రూ. 30,000 వరకు జీతం చెల్లించాలన్న నిబంధన విధించింది.

ఈ చట్టంపై పంజాబ్ హర్యానా హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ప్రైవేట్ సంస్థలు ఓపెన్ మార్కెట్ ద్వారా తమకు అర్హులైన ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే విషయంలో జోక్యం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించినదని మందలించింది. అంతేకాకుండా ఈ చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వాన్ని పరిరక్షించడం, ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛకు భంగం కల్పించడమేనని వ్యాఖ్యానించింది. దేశంలోని మిగతా రాష్ట్రాల పౌరుల హక్కులకు హర్యానా చట్టం వ్యతిరేకం కావడమేనని విమర్శించింది.అంతేకాకుండా ఇతర రాష్ట్రాలుకూడా ఇలాంటి చట్టాన్నే అమలు చేయడానికి వీలు కల్పిస్తుందని, ఫలితంగా దేశమంతటా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పౌరులకు ఉద్యోగాల కోసం ఎక్కడికీ వెళ్లనీయకుండా, స్వేచ్ఛ నీయకుండా కృత్రిమంగా గోడలుకట్టినట్టు అవుతుందని హెచ్చరించింది. కర్ణాటకలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటిఇఎస్) కంపెనీలు దాదాపు 5500 వరకు ఉన్నాయి.

ఇవి కాక మల్టీనేషనల్ కంపెనీలు 750 వరకు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 1.2 మిలియన్ మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అప్రత్యక్షంగా వీటి వల్ల 3.1 మిలియన్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశం మొత్తం మీద సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో కర్ణాటక నుంచే 40% ఎగుమతులు ఉంటున్నాయి. ప్రపంచ స్థాయిలో ఐటి పవర్ హౌస్‌గా కర్ణాటక గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ స్థాయి కంపెనీల్లో 40% కర్ణాటకలోనే ఉంటున్నాయి.

కార్మికులు తమ నైపుణ్యం, సామర్థం, అర్హతల బట్టి ఉద్యోగాలను పొందడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్తుండడం పరిపాటి. ఈ నేపథ్యంలో ‘స్థానికులు’ అన్న కారణంతో రాష్ట్రాలు అడ్డుగోడలు కట్టడం, ఆంక్షలు విధించడంచేస్తే ఉద్యోగాలకోసం ఎక్కడి నుంచో వచ్చే అభ్యర్థులకు అన్యాయం చేసినవారవుతారు. వారి అవకాశాలకు అనుసంధానం కల్పించలేని వారవుతారు. కర్ణాటక వంటి రాష్ట్రాలు నిజంగా కార్మికుల హక్కులను రక్షించాలనుకుంటే ఇలాం టి ప్రతిబంధకాలు కల్పించే చట్టాలు తీసుకురాకూడదు. స్థానికులకు విద్య కల్పించడంలోను, వ్యాపారాలు నెలకొల్పడం లోను తగిన పెట్టుబడులు అందించడం చేయాలి. యువకులకు ఆయా రంగాల్లో నైపుణ్యం అభివృద్ధిపరిచే కార్యక్రమాలు చేపట్టాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News