Thursday, January 23, 2025

జనాభా ప్రకారం బిసిలకు స్థానిక రిజర్వేషన్లు పెంచాలి

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు బిసి నేతల వినతి

హైదరాబాద్ : పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బిసి ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి, ప్రధానమంత్రికి సన్నిహితుడు భూపేందర్ యాదవ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బిసి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బిసిల జనాభా దేశంలో 56 శాతం ఉన్నా స్థానిక సంస్థల్లో ఆయా రాష్ట్రాలలో 18 నుంచి 22 శాతం వరకు మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర స్థాయిలో విద్యా, ఉద్యోగాలలో బిసిలకు రిజర్వేషన్లు కేవలం 27 శాతం మాత్రమే ఉన్నాయని, వెంటనే రిజర్వేషన్లను జనాభా ప్రకారం 56 శాతానికి పెంచాలని కోరారు. జనాభా ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉందని అయితే ఎస్‌షి, ఎస్‌టిలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి బిసిలకు కల్పించకపోవడం అన్యాయమని ఆయనన్నారు. ఇప్పటికీ 75 సంవత్సరాలుగా బిసిలకు దక్కాల్సిన ఉద్యోగాలు, పదవులు, పథకాలు దక్కకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. బిసి విద్యార్థులకు కేంద్రస్థాయి స్కాలర్ షిప్ పథకం, ఫీజు రియింబర్స్ మెంట్ ట్ పథకం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో ప్రవేశపెట్టాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్లు హాస్టళ్ళు, గురుకుల పాఠశాల స్కీములు దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. బిసి విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలని, బిసి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సుప్రీమ్ కోర్టు – హై కోర్టు జడ్జీల నియామకాలలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కేంద్రంలో బిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజుల రియింబర్స్ మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రాలకు 80 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ తో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కలలో బిసి కులాల లెక్కలు సేకరించాలని కోరారు.
కేంద్ర మంత్రి హామీ
బిజెపి ప్రభుత్వం కులాల వారిగా లెక్కలు తీయడానికి సుముఖంగా ఉందని, సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బిసి ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ప్రధా మోడితో, ఇతర కేంద్ర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, టి. రాజ్ కుమార్, గోవింద్, భాషయ్య, పరుషారమ్ తదితరులు యున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News