Saturday, November 16, 2024

స్థానిక జీవనగాథల కొండ

- Advertisement -
- Advertisement -

సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథలు, వంశీ రచించిన మా పసలపూడి కథలు ఎంతటి ప్రాచుర్యాన్ని పొందాయో మనందరికీ తెలిసిందే! కథ అంటే కథావస్తువు, శైలి, శిల్పంలాంటి లక్షణాలు ఉండాలనే నియమాలకు ప్రాధాన్యతనివ్వకుండా తాము పుట్టి పెరిగిన ప్రాంతంలోని సామాజిక పరిస్థితులను, జీవన విధానాలను, ఆ ప్రాంత చరిత్రను చక్కని రచనా నైపుణ్యంతో జనరంజకంగా మలచడంతో పాఠకులు అక్కున చేర్చుకున్నారు. కథ ఏదైనా, అందులోని సందేశం ఎలాంటిదైనా ఉపయుక్తమైన జీవితానుభవాలు, మనల్ని మనం గుర్తు చేసుకునే సంఘటనలు, అనుభూతి చెందే సన్నివేశాలు ఉంటే అది కచ్చితంగా పాఠకుడి మనస్సుని గెలుస్తుంది. ఎప్పుడైతే పాఠకుడు తనని తాను ఏ కథల్లో చూసుకోగలుగుతాడో ఆ కథలు సింహాసనాన్ని అధిష్టించినట్లే!

ఒక కథ పుట్టిడానికి ఎక్కడో జరిగిన ఒక సంఘటనో, తాను చూసిన సన్నివేశమో, తనకు ఎదురైన అనుభవమో కారణమవుతుంది. లేదా వినడం ద్వారానో, చదవడం ద్వారానో ప్రేరణ పొంది కాల్పనిక సాహిత్యం పుడుతుంది. కథ అంటే ఈ అంశాలే ఉండాలనే నియమం లేదని నమ్మిన కొంతమంది కథకులు కథావస్తువులను తాము పుట్టి పెరిగిన గ్రామ నేపథ్యంలోంచే తీసుకుని అనుభూతి చెందే జ్ఞాపకాలను కథలుగా అందిస్తున్నారు. ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి కూడా ఈ కోవకు చెందిన కథకుడే!

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, నటుడిగా, దర్శకుడిగా, జర్నలిస్ట్ గా తెలుగు ప్రజానికానికి సుపరిచితులే. ఇప్పటివరకు రెండొందల యాభైకిపైగా కథలు, మూడొందలకుపైగా కవితలు ప్రచురితమయ్యాయి. పదకొండు కథాసంపుటాలు, ఏడు కవితా సంపుటాలు, రెండు నాటికలు వెలువడ్డాయి. ఎన్నో కథలకు బహుమతులు అందుకున్నారు. సాహిత్య సేవకు బిరుదులు పొందారు. వీరి కథలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. పరస్పర సహకార పద్ధతిలో కథాసంకలనాలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఏ మాత్రం ప్రయోజనం ఆశించకుండా, ఆ యేడు మంచి కథల్ని ఏరి ఒకచోట పాఠకులకు అందించాలని తన సొంత ఖర్చులతో దాదాపు పదేళ్ళనుంచి ప్రతియేటా కథాసంకలనం వెలువరిస్తున్న సాహితీ కృషీవలుడు ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి. నవంబర్ 2022లో ఆయన వెలువరించిన పన్నెండవ కథాసంపుటే మా పెనుగొండ కథలు. ఇందులో మొత్తం ఇరవై రెండు కథలున్నాయి. కథలు అనడం కన్నా పెనుగొండ ప్రస్థానాన్ని నలుదిక్కులకూ వ్యాపింపజేసిన ప్రముఖుల వ్యక్తిత్వాలు, జీవన విధానాలు, ఆదర్శాలు కథలుగా మలచబడ్డాయి అని చెప్పడం సమంజసం.

పెనుగొండ పేరు చెప్పగానే జమా జెట్టీల్లాంటి ఐదుగురు కుర్రాళ్ళు గుర్తుకొస్తారు. సత్తిపండు, సూరిపండు, జాంపండు, పనసపండు, రాంపండులు. వాళ్ళు అసలు పేర్లతో కన్నా పంచపండుల పేర్లతోనే ప్రసిద్ధి. వాళ్ళ పేర్లు చెప్పగానే ఊళ్ళో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. జనం అంతలా ఉలిక్కిపడడానికి వాళ్ళేం రౌడీలు కాదు. అలాగని ‘కాని’ పనులు చేయలేదు. చేసిందంతా ‘అల్లరి’. ఆ అల్లరి కొందరికి కోపం తెప్పిస్తే మరికొందరికి నవ్వు తెప్పించింది.
బడిలో ఆడపిల్లలను ఏడిపించడం మొదలుకొని సుహాసిని చేతుల్లో ఎలా అవమాన పడ్డారో చదివి నవ్వుకోవాల్సిందే! బడిలో అల్లరి చేస్తున్నా, ఇళ్ళ దగ్గర మాత్రం చుట్టుపక్కల వారికి సాయంగా ఉంటారు పంచపండులు. మంచి మార్కులే వేయించుకుంటారు. ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో పంచపండులు ఉత్తీర్ణత సాధించారు. అందుకే ఆరోజు సెకండ్ షో సినిమాకు వెళ్లి వస్తున్నారు. ఇంతలో వంతెన మీదనుంచి ఎవరో ‘దభీ’మని కాలువలో పడిన శబ్దం అయ్యింది. అందరూ ఉలిక్కిపడ్డారు. సత్తిపండు, రాంపండు కాలువలోకి దూకి మనిషిని రేవుకు తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆడ మనిషి. ఎవరైతే ఏంటని సూరిపండు ఆ అమ్మాయి పొట్టమీద రెండు చేతులూ పెట్టి నొక్కాడు. తమ జేబుల్లోంచి కర్చీఫులు తీసి ఆ అమ్మాయి అరికాళ్ళు తడి లేకుండా తుడిచి గట్టిగా రుద్దారు. కాసేపటికి ఆ అమ్మాయి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమెకు చనిపోయేంత కష్టం ఏమొచ్చిందని పంచపండులు అడిగారు. ఆమె తన బాధలన్నీ చెప్పుకుంది. అదే సమయంలో ఆమె అత్తామామలు అక్కడికొచ్చారు. పంచపండులు వాళ్ళను గుర్తుపట్టారు. వీళ్ళూ వాళ్ళని గుర్తుపట్టారు. తర్వాతేమైంది? పంచపండులు ఆమె అత్తామామలకు బుద్ధి చెప్పారా? కోడల్ని తీసుకుని వాళ్ళు వెళ్ళారా? పంచపండులు తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలియాలంటే పంచపండులు కథ చదవాల్సిందే!

బాల్యంలో ఎన్ని అల్లరి వేషాలు వేసినా, స్థిరమైన లక్ష్యంతో గమ్యంవైపు పయనిస్తే గెలుపు తథ్యమని, ఒకప్పటి అభిప్రాయాలు మారిపోతాయని, ఆదర్శంగా నిలుస్తారని తెలియజెప్పిన కథ పంచపండులు.పెనుగొండలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల పదిహేను గ్రామాల నుంచి జనం వస్తారు. మెయిల్ బజారులోని రామాలయం ముందు సైకిల్ పెట్టుకుని అగరుబత్తీలు, అత్తరు అమ్ముతాడు జబ్బార్. అతని దగ్గర మత్తెక్కించే పరిమళాలే కాదు, మైమరిపించే మాటలు కూడా ఉంటాయ్. జబ్బార్ కుటుంబం మొత్తం అతని ఆదాయంపైనే బతుకుతోంది. కాలంలో మార్పులు వచ్చాయ్. చాలామంది గల్ఫ్ దేశాలు వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఖరీదైన సెంట్లు తేవడం మొదలు పెట్టారు. పెళ్లిళ్లకు సెంట్లు కావాల్సి వస్తే విదేశాలనుంచి కొరియర్ లో తెప్పిస్తున్నారు. దాంతో సువాసనలు వెదజల్లే సెంట్లు అమ్మే జబ్బార్ అవసరం బాగా తగ్గిపోయింది, అతని ఆదాయమూ పోయింది. కాలచక్రంలో పదేళ్ళు గిర్రున తిరిగాయి. రామశర్మ గారి సహకారంతో కొడుకుని దుబాయ్ పంపించాడు. కూతురు పెళ్లి చేశాడు. దుబాయ్ నుంచి కొడుకు పంపుతున్న డబ్బుల్తో అప్పులన్నీ తీర్చేశాడు. అవన్నీ తీరాక కొడుకు రాజమండ్రిలో ఎలక్ట్రికల్ షాపు పెట్టుకున్నాడు. అయినా వారంలో నాలుగు రోజులు సైకిల్ మీద తిరుగుతూ అగరుబత్తీలు అమ్ముతూనే ఉన్నాడు జబ్బార్. ఒకరోజు రామశర్మగారు, జబ్బార్, పొరుగూళ్ళు తిరిగి ఇలా అమ్ముకునే బదులు హాయిగా రాజమండ్రి వెళ్లి కొడుకు దగ్గర ఉండొచ్చుగా… అని అడిగారు. దానికి జబ్బార్ చెప్పిన సమాధానం మన కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తుంది. అసలు జబ్బార్ పెనుగొండ విడిచి వెళ్ళడానికి ఎందుకు నిరాకరిస్తున్నాడు? కొడుకు ఎన్నిసార్లు రాజమండ్రి రమ్మన్నా ఎందుకు వెళ్ళట్లేదు? రామశర్మ గారికి చెప్పిన సమాధానం ఏమిటో తెలియాలంటే పరిమళం అనే కథను చదివి ఆ సువాసనలు ఆస్వాదించండి.

తాను పుట్టిన గడ్డమీద మనిషి ఎంతటి మమకారంతో ఉంటాడో, తనకి జీవితాన్నిచ్చిన ఊరికోసం తానేదైనా చేయాలని ఎంతగా తపన పడతాడో పరిమళం అనే కథ తెలియజేస్తుంది. తలలో నాలుకగా మారడం అనే దానికి ఉదాహారణే జబ్బార్ జీవితం. పెనుగొండ లింగాల వీధిలో పోస్టాఫీస్ ఎదురుగా కన్నమ్మ కుటుంబంతో ఉంటోంది. ఆమె భర్త తాపీ పని చేస్తూ దుబాయిలో ఉంటాడు. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఒకసారొచ్చి నెల రోజులుండి వెళ్తాడు. వాళ్లకు ముగ్గురు పిల్లలు. భర్త పంపిన డబ్బు జాగ్రత్తగా దాచి రెండెకరాల పొలం కొంది కన్నమ్మ. ఒక పాలేరుని పెట్టుకుని తనే స్వంతంగా వ్యవసాయం చేస్తోంది. ఇంటి దగ్గరే ఒక గేదెను మేపుతూ పాలు కూడా అమ్ముతోంది. ఒకరోజు బజారులోని మెడ షావుకారు గారి భార్య, ‘పిల్లాడు అర్భకంగా పుట్టాడు. తల్లి దగ్గర పాలు లేవు. డబ్బా పాలు పడటం లేదు. కొన్నాళ్ళైనా తల్లి పాలు పట్టించమని డాక్టర్ చెప్పాడు. నువ్వు నాకో సాయం చేయాలి కన్నమ్మా… నా మనవడికి, నీ బిడ్డతో పాటు పాలిచ్చి పెంచాలి. బట్టలు ఉతకడానికి వస్తున్నానని చెప్పాలిగాని పాలిస్తున్న సంగతి ఎక్కడా చెప్పొద్దు’ అని కన్నమ్మ సాయం కోరింది. తాను తక్కువ కులంలో పుట్టడం కారణంగా ఏం సమాధానం చెప్పాలో తెలీక సతమతమైన కన్నమ్మ చివరికి ఏ నిర్ణయం తీసుకుంది? ఆమె తీసుకున్న నిర్ణయం మూలంగా ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తెలియాలంటే కన్నమ్మ కథను చదవాల్సిందే!
కన్నమ్మ భర్త దూరంగా ఉండటం, ఆమె ఒంటరిగా ఉండటం చూసిన కొంతమంది ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నం చేయసాగారు. ఆమె అందాన్ని తనివితీరా ఆస్వాదించాలని చూసేవాళ్ళ మధ్య గౌరవంగా ఎలా బతికింది? ఇక్కడ ప్రస్తావించిన మూడు కథల నేపథ్యాలూ వేర్వేరు. కానీ ఇవన్నీ పెనుగొండ కథలే. అక్కడి జీవన విధానాలే. ఇవే కాదు, ఈ సంపుటిలోని ప్రతి కథలోనూ మన ఊళ్లోనూ ఇలాంటిదే జరిగిందే, ఇటువంటివారు మా ఊళ్లోనూ ఉన్నారని గుర్తు చేసుకోవడం ఖాయం. ఒక విషయాన్ని అందమైన కథగా కూర్చి పాఠకుల మనసు గెలుచుకోవడం ఎలాగో బాగా తెలిసిన కథకుడు ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి. అందుకే ఆయన కథల్లో పాఠకుడు దేన్నో చేధించడానికి వెళ్తున్నట్లు చదవనక్కరలేదు. మన సరదాలను, సంతోషాలను, మన అల్లరులను, చిలిపి పనులను ఓ సారి నెమరు వేసుకున్నట్లుగా ఉన్నాయి పెనుగొండ కథలు.అంతేనా, నవరాత్రి ముచ్చట్లు చెప్పారు. శ్రీరామ నవమి సంబరాలు కళ్ళకు కట్టారు. బొమ్మల కొలువు గుర్తు చేశారు. అంతకంటే ఇంకేం కావాలి? రెండుమూడు కథలు చదివితే మిగతా కథల్ని చదివించే బాధ్యత పుస్తకమే తీసుకుంటుంది.‘పెనుగొండ ఆత్మను ఆవిష్కరించిన కథల’ని ప్రముఖ కథ, నవల, నాటక రచయిత శ్రీ సింహ ప్రసాద్ గారు ఈ సంపుటికి ముందుమాట అందించారు. ‘స్థానిక కథల ఆనవాళ్ళ’ని ప్రసిద్ధ కథకులు, కవి, డా. జడా సుబ్బారావుగారు తమ నేపథ్యాన్ని ముందుమాట ద్వారా గుర్తుచేసుకోవడం బాగుంది. బాలి గారి బొమ్మ చూడముచ్చటగా ఉంది. ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి నిస్వార్థమైన సాహితీ సేవను చేస్తూనే, జనరంజకమైన కథలను సృజించాలని ఆశిస్తూ…

కథాసంపుటి : మా పెనుగొండ కథలు
రచయిత : ఎమ్.ఆర్.వి. సత్యనారాయణమూర్తి
పేజీలు : 176
వెల : రూ.250
ప్రతులకు : 98486 63735

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News