Thursday, January 23, 2025

జనగామ దాకా లోకల్ ట్రైన్‌ను పొడిగించాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : జనగామ దాకా లోకల్ ట్రైన్‌ను పొడిగించాలని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డికి, శ్రీనివాస్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. ఈ విషయమై రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని మోడీకి చెప్పి ఒప్పించాలని శ్రీనివాస్‌రెడ్డి ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఎంఎంటిఎస్ రైల్వేలైన్, లోకల్ ట్రైన్‌ను మంజూరు చేయించాలని, జనగామకు లోకల్ రైలు వస్తే అటు రైల్వేకు లాభం చేకూరుతుందని, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో జనగామ ఒకటని, జనగామతో పాటు చుట్టూ 50 నుంచి 60 కి.మీల మేర పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారని లేఖలో ఆయన వివరించారు.

ప్రస్తుతం కిక్కిరిసి ప్రయాణాలు

జనగామ, ఆలేరు, భువనగిరి పట్టణాలతో పాటు, పెంబర్తి, వంగపల్లి, రాయగిరి, బీబీనగర్, ఘట్‌కేసర్ నుంచి ప్రజలు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఉన్నత చదువుల కోసం విద్యార్ధులు, వివిధ శాఖ ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగించే వారంతా వ్యక్తిగత పనుల మీద, రోజువారి కూలీలు, వ్యాపారపరంగా వెళ్లేవారని, ఇలా వేలాది మంది నిత్యం రైళ్లల్లో ప్రయాణాలు సాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న అతి కొద్దీ రైళ్లల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

కొన్ని సార్లు రైలు డబ్బాలకు వేలాడుతూ, అత్యంత ప్రమాదకర ప్రయాణాలకు చేయాల్సిన దీనస్థితి నెలకొందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ విస్తరణ, జిల్లా కేంద్రమైన తరువాత జనగామ వరంగల్, కాజీపేటలకు, ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్‌లకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో కొద్ది రోజుల్లోనే జనగామ అటు కాజీపేట, ఇటు హైదరాబాద్‌లో కలుస్తాయన్నారు. ముందుగా జనగామ వరకు, ఆ తర్వాత వరంగల్ వరకు దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని విస్తరించే అవకాశ ముందన్నారు. రైల్వే లైన్లో లోకల్ రైలు వేస్తే రోడ్లపై రద్దీ కూడా తగ్గి ఈ రెండుదారుల్లో ప్రయాణాలు సులువవుతాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News