హైదరాబాద్: కరోనా రెండో దశ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం పొడిగించడం జరిగింది. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న పలు పోలీస్ స్టేషన్ పరిదిలల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇవాళ ఇసిఐఎల్, మల్కాజిగిరి, కుషాయిగూడ, చక్రిపురం ప్రాంతంలో చెక్ పోస్టులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత క్రిష్ణమూర్తి పరిశీలించారు.
ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ… లాక్ డౌన్ ను అందరూ స్వచ్చందంగా సహకరించాలని షాపుల యజమానులు ఉదయం 10 గంటల తరువాత స్వచ్ఛందంగా మూసివేయాలని, అదేవిధంగా అత్యవసర వాహనాలు తప్ప అనవసరంగా తిరిగే వాహనాలను సీజ్ చేసి లాక్ డౌన్ తరవాతే వాహనం విడిచిపెడతామని వాహనదారులను హెచ్చరించారు.
అలాగే ప్రతి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న రహదారులు పూర్తిగా మూసివేయబడతాయని ఇకపై లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా ఉండబోతున్నాయని ప్రజలు పోలీసు అధికారులకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.