చండీగఢ్ : ఈనెల 26 వరకు అంటే మరో వారం రోజుల పాటు హర్యానాలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అయితే రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు మరో గంట అంటే రాత్రి 11 వరకు తెరిచి ఉంచడానికి అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయ్‌వర్ధన్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం ఈనెల 19 తెల్లవారు జాము 5 గంటల నుంచి 26 తెల్లవారు జాము 5 వరకు ఈ లాక్‌డౌన్ పొడిగింపు అమలులో ఉంటుంది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో రెస్టారెంట్లు, బార్లు, హోటల్స్, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు నుంచి హోమ్ డెలివరీకి రాత్రి 11 గంటల వరకు అనుమతించారు.
క్లబ్బులు, గోల్ఫ్‌కోర్సులు కూడా ఇదే విధంగా తెరిచి ఉంచవచ్చు. జిమ్స్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. రాత్రి కర్ఫూ ప్రతిరోజూ రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. సామాజిక దూరం, శానిటైజేషన్, తదితర ఇతర నిబంధనలు యధా ప్రకారం పక్కాగా అమలవుతాయి. హర్యానాలో కొవిడ్ కేసులు, పాజిటివ్ రేటు తగ్గినప్పటికీ ముందు జాగ్రత్తల దృష్టా కరోనాను కట్టడి చేయడానికి చర్యలు కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ‘మహామారి అలెర్ట్‌సురక్షిత్ హర్యానా’ అని వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 50 కన్నా దిగువకు చేరుకున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గింది. రాష్ట్రంలో మే 3న లాక్‌డౌన్ అమలు ప్రారంభించారు. ఇప్పుడు పదకొండోసారి పొడిగించారు.