జాతీయ రహదారులపై పెరిగిన వాహనాల రద్దీ
మహారాష్ట్ర సరిహద్దులో నిలిచిపోయిన రాకపోకలు
లక్ష్మీ బ్యారేజీ, కాళేశ్వరం వంతెనలపై చెక్ పోస్టుల ఏర్పాటు
సడలింపు సమయంలో కిక్కిరిసిన మార్కెట్లు
జిల్లా ఎస్పి నేతృత్వంలో పోలీసు పహార
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు పహార మధ్య రెండోరోజు లాక్డౌన్ అమలైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పిల నేతృత్వంలో లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉండడంతో మార్కెట్లు, నిత్యవసర వస్తుసామాగ్రి దుకాణాలు, వైన్‌షాపులు కిటకిటలాడాయి. ఆయా దుకాణాల, మార్కెట్లలో భౌతిక దూరం, మాస్క్‌లు ధరించాలని పోలీసులు మైకుల ద్వారా ప్రజలకు వివరించారు. ఈక్రమంలో కరోనా నియమనిబంధనలు పాటించని వ్యాపారులు, కొనుగోలు దారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా లాక్డౌన్ నేపథ్యంలో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఈక్రమంలో సడలింపు సమయం 4 గంటలల్లోనే 7వేల వాహనాలు వెళ్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ ఉండడంతో వాహనాలు దూసుకుపోతున్నాయి.
రోజుకు నాలుగు నుంచి ఐదువేల వాహనాలు మాత్రమే వెళ్లేవని, లాక్డౌన్ కారణంగా వాహన చోదకులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు 6 గంటల నుంచి 10 గంటల సమయంలో 7 వేలకుపైగా వాహనాలు వెళుతున్నాయని సంబంధిత అధికార వర్గాలు వివరిస్తున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 10గంటల తర్వాత ఎవరూ బయట తిరగకూడదని, అకారణంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలతోపాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.లాక్డౌన్లో అమలుతో తెలంగా-ణ,మహారాష్ట్ర మధ్య అంతరాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. మహదేవపూర్ మండలం లక్ష్మీ బ్యారేజీ వంతెన, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసర అనుమతి పత్రాలు ఉన్న వారి ప్రయాణానికి అనుమతిస్తున్నారు.అలాగే సూర్యాపేట జిల్లా కోదాడలో ఎప్పుడులేని విధంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మజీద్ కాంప్లెక్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే అన్నిరకాల దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు లాక్డౌన్ సడలింపు సమయంలో పెళ్లిళ్ల దృష్ట్యా ఉదయం నుంచే వస్త్ర దుకాణాల్లో రద్దీ కనపడింది.
ఉదయం పది తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరం ఉన్న వారిని మాత్రమే పోలీసులు రోడ్లపైకి అనుమతిస్తున్నారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అనవసరంగా రోడ్లపైకి వస్తున్నవారిపై పోలీసులు చలన్లు విధించారు. ఉదయం 10 గంటల నుంచి అత్యవసర దుకాణాలు తప్ప మిగిలిన దుకాణాలన్ని పూర్తిగా మూసివేశారు.మురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రంజాన్ పండుగ నేపథ్యంలో మార్కెట్లో సందడి నెలకొంది. ఉదయం 10గంటల వరకే అనుమతి ఉండటంతో దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. పది గంటల తర్వాత పోలీసులు అన్ని దుకాణాలు మూసివేయించిన పోలీసులు ప్రజలెవరకూ బయట తిరగవద్దని హెచ్చరించారు. కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్న రెండు దుకాణాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 10 గంటల తరువాత షటర్లు మూసి వేసి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించి కేసులు పెట్టారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండోరోజు లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం బోసి పోయింది. ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ తీవ్ర నష్టం ఎదుర్కొంటోంది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రతి రోజూ 80 నుంచి 90 లక్షల ఆదాయానికి గానూ ప్రస్తుతం కేవలం రూ.5 లక్షలే వస్తోంది. పదుల సంఖ్యలోనే బస్సులు తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు రద్దు చేశారు.ప్రజలు బయటికి రావొద్దురాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో లాక్డౌన్ అమలు తీరును ఎస్పి రాహుల్ హెగ్డే పరిశీలించారు. గడువు ముగిసిన తర్వాత బయటకొచ్చిన వాహనదారులను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించారు. లాక్డౌన్ దృష్టా హైదరాబాద్‌లోని అన్ని ట్రాఫిక్ కూడళ్లలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 350 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బారికేడ్లు పెట్టి పలు ఫ్లైఓవర్లను పోలీసులు మూసేస్తున్నారు. కొన్ని చోట్ల ఉదయం 10 గంటల తర్వాత కూడా జనాలు రోడ్లపై తిరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమై జనాలను ఇళ్లకు వెళ్లవల్సిందిగా హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఉదయం పది గంటల వరకే సమయం ఉండటంతో నిత్యావసరాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివచ్చారు. మరోవైపు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు.
దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కామారెడ్డిజిల్లాలోని ఎల్లారెడ్డి కూరగాయల మార్కెట్లో ప్రజలు బారులు తీరారు. రంజాన్ సందర్భంగా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 10 వరకే దుకాణాలు తెరిచి ఉండటంతో పలు మార్కెట్లు రద్దీగా మారాయి. కరీంనగర్లో పలు చోట్ల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. లాక్డౌన్ ఆంక్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం నాలుగు గంటల పాటు ఉండడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం జనం అధిక సంఖ్యలో మార్కెట్లకు తరలి వస్తున్నారు. దీంతో పలు చోట్ల రోడ్లు ట్రాఫిక్ జామ్‌తో రద్దీగా మారాయి. యాదాద్రి భువనగిరిలో నిత్యవసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజల పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. దీంతో కూరగాయల మార్కెట్లు కిక్కిరిసి పోయాయి. దీంతో రోడ్డపై ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిలావుండగా వలస కూలీలు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వేలసంఖ్యలో వలస కార్మికులు చేరుకున్నారు. దీంతో రిజర్వేషన్ ఉన్నవారినే చెక్ చేసి రైల్వే అధికారులు వారిని స్టేషన్ లోపలికి అనుమతిస్తున్నారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో ఒరిస్సా, యూపీ, మహారాష్ట్రలకు కూలీలు తరలివెళ్లే క్రమంలో స్టేషన్ బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రయాణికులను క్యూలైన్లు కట్టించి.. టికెట్టు ఉన్న ప్రయాణికులను లోనికి అనుమతించారు.