Saturday, November 23, 2024

15 నుంచి నాగ్‌పూర్ లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

 నగరం, ఆ పరిసరాల్లో వారం రోజుల పాటు కఠిన లాక్‌డౌన్ అమలుకు నిర్ణయం
 మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ విధించే సూచన 
 రెండు రోజుల్లో నిర్ణయం : ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటన

ముంబై : మహారాష్ట్రలోని నాగ్‌పూర్, సమీప ప్రాంతాలలో ఈ నెల 15వ తేదీ నుంచి కఠినమైన లాక్‌డౌన్‌ను విధిస్తున్నారు. నాగ్‌పూర్, చుట్టుపక్కల ప్రాంతాలలో క్రమేపీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమలులోకి తెస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గురువారం ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకూ లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. ప్రజలు అంతా ఖచ్చితంగా నిబంధనల మేరకు వ్యవహరించాలని, లాక్‌డౌన్ కటుతరంగానే ఉంటుందని థాకరే హెచ్చరించారు. దేశంలో మొత్తం మీద కరోనా కేసులు తగ్గుతూ ఉన్నా చాలాకాలంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాలలో కరోనా అదుపులోకి రాకపోవడం కేంద్రాన్ని కలవరపరుస్తోంది. ఇప్పటికైతే నాగ్‌పూర్, సమీప ప్రాంతాలలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని, ఇక ముందు పరిస్థితిని అంచనావేసుకుని మరికొన్ని ప్రాంతాల్లో కూడా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా విషయంలో రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. నాగ్‌పూర్ నగరం, సమీప ప్రాంతాలలో 15వ తేదీ నుంచి వారం రోజుల లాక్‌డౌన్ అమలులోకి వస్తుంది, ఇతర ప్రాంతాలలో కూడా కేసుల సంఖ్య కలవరం కల్గిస్తోందని, అక్కడ కూడా లాక్‌డౌన్ విధించే విషయాన్ని పరిశీలించుకుని వచ్చే రెండు రోజులలో నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ముంబైలోని జెజె హాస్పిటల్‌లో థాకర్ ఆయన భార్య రష్మీ కొవాగ్జిన్ తొలి డోస్ తీసుకున్నారు. వారి వెంట అత్తయ్య మీనాతాయ్ పతంకర్‌చ వ్యక్తిగత సహాయకులు మిలింద్ నర్వేకర్ కూడా టీకా పొందారు. తరువాత సిఎం విలేకరులతోమాట్లాడారు. వ్యాక్సినేషన్ విషయంలో ఎటువంటి గందరగోళం లేదని, దీనిని అంతా ఎటువంటి భయాలు లేకుండా తీసుకోవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున, అర్హులైన వారంతా ఎటువంటి సంకోచాలు లేకుండా టీకాలు తీసుకోవాలని, తాను తీసుకున్నానని తెలిపారు. అంతకు ముందు నాగ్‌పూర్ జిల్లా సంరక్షక మంత్రినితిన్ రౌత్ నాగ్‌పూర్ , సమీప ప్రాంతాలలో 15వ నుంచి వారం రోజుల లాక్‌డౌన్‌ను అధికారికంగా ప్రకటించారు. అధికారులను ఈ విషయంలో ఆదేశించారు. కొవిడ్ రోగుల సంఖ్య పెరుగుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రౌత్ వివరించారు. లాక్‌డౌన్ దశలో నాగ్‌పూర్ సమీప ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలలో పాతికశాతం సిబ్బంది హాజరీ ఉండేలా చర్యలు తీసుకుంటారు. లాక్‌డౌన్ దశలో పరిశ్రమలు, ఇతర సంస్థలు, నిత్యావసరేతర దుకాణాలు మూసి ఉంటాయి. లాక్‌డౌన్ దశలో ప్రజలు తిరగకుండా, గుంపులుగా చేరకుండా కట్టుదిట్టమైన రీతిలో కర్ఫూ అమలు అయ్యేలా చూడాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు కాంప్టీ, కొరాడీ, హింగానా పట్టణాల్లోనూ లాక్‌డౌన్ ఉంటుందన్నారు.
మహారాష్ట్రలో రోజువారీ కేసులు విపరీతం
మహారాష్ట్రలో ఫిబ్రవరి నెలలోనే 1.31 లక్షల మందికి కరోనా సోకింది. అంతకు ముందు 92,177 మందికి వైరస్ రాగా ఇది పెరుగుతూ పోయింది. అయితే కరోనా మృతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మహానగరం ముంబైలో యాక్టివ్ కేసు ల సంఖ్య పెరుగుతోంది. అమరావతి, యవత్‌మాల్, ముంబై, అకోలా, విదర్భ కొ న్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 9 నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు లాక్‌డౌన్ విధించే నాగ్‌పూర్‌లో రోజువారి కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే నాగ్‌పూర్‌లో 1710 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్ విధింపుతో కరోనా టీకాలు వేసే ప్రక్రియకు ఇబ్బంది ఉండదని, అయితే కరోనా టీకా తీసుకునే వారితో ఒక్కరే సహాయకులుగా రావాల్సి ఉంటుందని మంత్రి రౌత్ తెలిపారు.
lockdown imposes in Nagpur from march 15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News