Monday, January 20, 2025

నిరసనల నడుమే ఢిల్లీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం(సవరణల ) బిల్లు 2023ను గురువారం లోక్‌సభ ప్రతిపక్షాల నిరసనలు, వాకౌట్ల నడుమ ఆమోదం పొందింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అధికారుల పరిధికి సంబంధించిఈ బిల్లు అత్యంత వివాదాస్పదం అయి ఉంది. ఢిల్లీ ప్రభుత్వ సంబంధిత సీనియర్ అధికారుల నియామకం, బదిలీల నిర్వహణాధికారాలకు సంబంధించి మే నెలలో కేంద్రం కీలక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీని మేరకు ఈ ఉద్యోగులపై సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి. ప్రతిపక్షాలు ఈ ఆర్డినెన్స్‌పై పలుస్థాయిల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చినా, ఆప్ నేత దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటించి, తోటి ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకున్నా ఆర్డినెన్స్ స్థానంలో ఉద్ధేశించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం, దీనిని ఆమోదింపచేసుకోవడంలో ప్రభుత్వం తన పట్టు సాధించింది. బిల్లుపై నాలుగుగంటల పాటు చర్చ జరిగింది. ప్రతిపక్షం, అధికారపక్షం నడుమ తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. చర్చకు ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు ఇచ్చారు.

ప్రతిపక్ష కూటమి ఇండియాపై నిప్పులు చెరుగుతూ వాడివేడిగా మండిపడ్డారు. ఇటువంటి బిల్లును తీసుకువచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం, ఢిల్లీ పరిధిలో తగు చట్టాలను తీసుకువచ్చే పూర్తి స్థాయి సంపూర్ణ హక్కు కేంద్రానికి ఉందని, తగు విధంగా తాము నిబంధనలను కూడా రూపొందించవచ్చునని తెలిపారు. ఈ బిల్లును ్రప్రభుత్వం తీసుకురాదల్చుకున్నప్పుడు విచిత్రరీతిలో దీనికి వ్యతిరేకంగా అప్పటివరకూ ఎవరికి వారే గా ఉన్న పార్టీలు ఏకం అయ్యాయని, ఇప్పుడు బిల్లు సభలోకి రావడం, ఆమోదం పొందుతున్నందున ఇక ప్రతిపక్ష కూటమికి నూకలు చెల్లినట్లే అన్నారు. ఢిల్లీ ప్రజానీకం బాగోగులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్డినెన్స్ తరువాత ఈ బిల్లు తీసుకువచ్చినట్లు, ఇందులో ఏ తప్పు లేదని సమర్థించారు. బిల్లు రాజ్యాంగబద్ధం, చెల్లనేరుతుంది కాబట్టి, వేరే మీమాంసలకు వెళ్లకుండా ప్రతిపక్షాలు కూడా దీనికి ఆమోదం తెలిపితీరాలని సూచించారు.

ఆయన జవాబు తరువాత లోక్‌సభలో గందరగోళం నడుమనే దీనిని ఓటింగ్‌కుపెట్డడం, దీనికి సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ నుంచి ప్రకటన వెలువడటం క్షణాల్లో జరిగాయి. ఈ దశలోనే ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ జరిపాయి. సభ్యుల ప్రవర్తనతీరు బాగా లేదని సభకు హాజరుకాబోనని ఒక్కరోజు క్రితం స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది. అయితే గురువారం ఆయన సభకు వచ్చారు. సభలో చర్చ దశలో బిల్లు ప్రతిని చింపి కాగితాలను ఆప్ ఎంపి సుశీల్‌కుమార్ రింకూ స్పీకర్ వైపు విసిరి నిరసన వ్యక్తం చేశారు. దీనితో ఈ సభ్యుడిని వర్షాకాల మిగిలిన దశ వరకూ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

ఢిల్లీ కావాలా? కూటమి కావాలా?
లోక్‌సభలో గురువారం ఢిల్లీ సంబంధిత బిల్లు చర్చ దశలో అమిత్ షా ప్రతిపక్షాలను ఉద్ధేశించి వీరికి ప్రజల ప్రయోజనాల కన్నా వీరి కొత్త రాజకీయ కూటమిపైనే యావ ఉందని విమర్శించారు. ఇండియా కూటమిపై అస్త్రాలు సంధించారు. జనం బాగు కన్నా వీరికి తమ బంగళాల బాగు మిన్న అన్నారు. ఆప్‌ను ప్రతిపక్ష కూటమిలో చేర్చుకునేందుకు ఇతర ప్రతిపక్షాలు చివరికి ఢిల్లీ ప్రజల సాధకబాధకాలను కూడా గాలికి వదిలేశాయని, ఆప్ కూటమిలో ఉందని బిల్లును వ్యతిరేకించడం సరికాదని , విశాల రీతిలో ఆలోచిస్తే బాగు అన్నారు. ఆప్ ప్రభుత్వం 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు సేవలకు కాకుండా తగవులకు దిగుతూ గడిపిందని, వీరికి ఉద్యోగుల నియామకాలపై అధికారాలు పోతున్నాయనే బాధకన్నా , విజిలెన్స్‌శాఖపై కంట్రోలు పోతుందనే బాధ ఎక్కువైందన్నారు. వీరి అవినీతి సామ్రాజ్యాలపై తగు నిఘా పడుతుందనే భయాలు పట్టుకున్నాయని తెలిపారు. మణిపూర్ విషయంపై కూడా ప్రభుత్వం చర్చకు సిద్ధమని, అయితే ఇందుకు ప్రతిపక్షం ముందుకు రాదని, వీరికి మణిపూర్ కన్నా అధికారం రాజకీయాలు ముఖ్యం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News