Saturday, January 18, 2025

జమిలి ఎన్నికల బిల్లులకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశంఒకే ఎన్నిక ’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకు వచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129ఎ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. తొలుత ఈ బిల్లులను సభముందుంచగా, కాంగ్రెస్ , సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అటు ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత బిల్లును ప్రవేశ పెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు.

అనుకూలంగా 269 ఓట్లు
జమిలి బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. పార్లమెంట్ నూతన భవనంలో తొలిసారి హైబ్రిడ్ విధానంలో దీన్ని చేపట్టారు. ఇందులో కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా,మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్‌లో తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై అనుమానం ఉన్న వాళ్లు ఓటింగ్ స్లిప్పులతో క్రాస్ చెక్ చేసుకునేందుకు స్పీకర్ అనుమతించారు. మొత్తంగా ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. దాంతో ఈ బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదించినట్టయింది. జమిలి ఎన్నికల బిల్లులు లోక్‌సభలో ప్రవేశ పెట్టడానికి ముందు అధికార ఎంపీలు, విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లులను వ్యతిరేకించారు.

బేషరతుగా మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ
ఈ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. “ సృజనాత్మక ఆలోచనలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. సహకార సమాఖ్య తత్వానికి మేం అనుకూలం. జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గి సామర్థం పెరుగుతుంది. పోలింగ్‌శాతం మెరుగవుతుంది. ఎన్నికల ఖర్చు రూ. లక్ష కోట్లు దాటుతోంది. నిరంతరం ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది ” అని తెలుగుదేశం ఎంపీ వివరించారు.

శివసేన మద్దతు
జమిలి ఎన్నికలకు తాము మద్దతు ఇస్తున్నట్టు శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ప్రకటించారు. ప్రతిపక్షాలకు సంస్కరణలంటే అలర్జీ. అందుకే దీన్ని వ్యతిరేకిస్తోందని వ్యాఖ్యానించారు.
అవసరమైతే బిల్లును జేపీసీకి పంపుతాం : కేంద్ర మంత్రి అమిత్‌షా
ఈ బిల్లును జేపీసీకి పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. క్యాబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ స్వయంగా ఈ సూచన చేశారు రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లదు : కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్
“ జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదు. స్వీడన్,జర్మనీ వంటి దేశాల్లోనూ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ కోణం లోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి.

విపక్షాల వ్యతిరేకత
జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. ఏకకాలంలో ఎన్నికలు ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థపై దాడిగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారని, జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారి తీస్తాయని ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు చర్చ జరిగి రెండు రోజులు కాకుండానే రాజ్యాంగ సవరణ బిల్లును తేవడం రాజ్యాంగ స్ఫూర్తికి చరమగీతం పాడాలనుకోవడం సరికాదన్నారు. బిల్లులను నిర్దంద్వంగా తమ పార్టీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. “ జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు.. ఎన్నికల సంస్కరణలు. గతంలో ఎన్‌జేఏసీ (నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ ) బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు.

ఆ తర్వాత మౌలిక స్వరూపానికి ఎన్‌జేఏసి విరుద్ధమని సుప్రీం కోర్టు దాన్ని కొట్టేసింది. జమిలి ఎన్నికల చట్టం వస్తే దానికీ అదే పరిస్థితి ఎదురవుతుంది. ఒక జెంటిల్ మన్ కోరిక, కలను సాకారం చేసేందుకు ఈ బిల్లులను తెచ్చారు. ” అని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. “ జమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. ఇవి అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తాయి. ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీస్తాయి”అని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. “ ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బ తీయడమే. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలి. లేదా దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి ” అని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని డిఎంకె ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. ఇది సమాఖ్య హక్కులకు, ప్రజల ఆకాంక్షలకు కూడా విరుద్ధమని విమర్శించారు. “ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారు.

కానీ మీరు వాళ్ల హక్కులను దూరం చేస్తారని అనుకోవడం లేదు. ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల నుంచి లాక్కుని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం కరెక్టు కాదు. ఇలా చేయడం, రాష్ట్రాలకు, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకం . కేంద్రం ఆ బిల్లును అమల్లోకి తీసుకు వస్తే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలుగుతుంది . అందుకే తాము ఈ బిల్లును అంగీకరించబోము” అని కనిమొళి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News