అట్టహాసంగా నిర్వహణకు ప్రధాన పార్టీల సన్నాహాలు
కీలక నేతల కోసం తరలిరానున్న అగ్రనేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వాని కి ముహూర్తం సమీపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ ఘట్టానికి అట్టహాసంగా నిర్వహించేలా ప్రధాన రాజకీయ పార్టీలు ఏ ర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజునే నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కానుంది.అప్పటి నుంచి 25వ తేదీ వర కు కొనసాగనుంది.26న పరిశీలన,29న ఉపసంహరణ గడువు ఉండనుంది. నా మినేషన్ల దాఖలుకు ఈనెల 25 వరకు గ డువు ఉన్నా సరే ఎక్కువ మంది తొలి రో జుల్లోనే మంచి రోజులు ఉన్నాయని భావి స్తూ నామినేషన్లు దాఖలు చేసేందుకు అ భ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అ యితే ఈసారి మాత్రం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు నా మినేషన్లు ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల అ నంతరం జరుగుతున్న అతి ప్రధానమైన ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈ కార్యక్రమాన్ని జనాలను ఆకట్టుకునేలా నిర్వహించాలని మూడు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి నిలిపారు. ఇప్పటికే బిఆర్‌ఎస్, బిజెపిలు మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, అధికార కాంగ్రెస్ 14 స్థానాలకు ఇ ప్పటికే పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో ఒకటి రెండు రోజుల్లో కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాల అభ్యర్థులను వెల్లడించనున్నారు.
లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా కార్యక్రమాల్లో ఆయా పార్టీల కీలక నేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. అలాగే బిఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, అగ్రనాయకులు హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర బిజెపి అభ్యర్థుల నామినేషన్ల అంశాన్ని జాతీయ పార్టీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.
ఈ కార్యక్రమాలలో ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి లేదా కేంద్రమంత్రి ఒకరు స్వయం గా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల కీలక నేతల నామినేషన్ల దా ఖలుకు ఆయా పార్టీలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సిట్టింగ్ ఎంపి బండి సంజయ్ ఈనెల 19వ తేదీన నామినేషన్ వేయనున్నారు. కిషన్‌రెడ్డి నామినేష కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ హాజరుకానున్నారు. అలాగే పార్టీ ముఖ్యనేతలైన ఈటల రాజేందర్, డికె అరుణ ఈనెల 18న, ఎఐసిసి కార్యదర్శి, మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి ఈ నెల 19వ తేదీన, ఖమ్మం బిఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈనెల 24వ తేదీన, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 22న నామినేషన్లు వేయనున్నారు. బిఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్‌కుమార్ 20వ తేదీన నామినేషన్లను దాఖలు చేయనున్నారు.