Saturday, December 21, 2024

నేడే పోలింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రిక సమరానికి ఎన్నికల సం ఘం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానానికి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల సోమవారం పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోగా, ఓటు హక్కు వినియోగించేకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సా యంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, సమస్యాత్మక ప్రాంతాలైన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో, సాయం త్రం 4 గంటలకే పోలింగ్ ముయనున్నది.

ఆదిలాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సా.4 గంటలకే పోలింగ్ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాల బరిలో 525 మంది అభ్యర్థులు ఉండగా, కంటోన్మెంట్ అసెంబ్లీలో బరిలో 15 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. 51 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 ఇవిఎం యూనిట్లు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించబోతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని మూడు పోలింగ్ కేంద్రాల్లో 10,12,14 మంది ఓటర్లు ఉండగా, 13 పోలింగ్ కేంద్రాల్లో 25 మందిలోపు ఓటర్లు, 23 పోలింగ్ కేంద్రాల్లో 50లోపు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.32,16,348 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,65,13,014 మంది పురుషులు, 1,67,00,574 మంది మహిళలు, 2,760 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు.

పోలింగ్ విధుల్లో 1.90 లక్షల మంది సిబ్బంది
రాష్ట్రంలో 1,96,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. 160 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, పారా మిలిటరీ బలగాలతో మొత్తం 72 వేల మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారు. ఈ ఎన్నికలకు 12,909 మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు బ్యాలెట్ యూనిట్లలో ప్రదర్శించబడే అభ్యర్థుల క్రమాన్ని తనిఖీ చేయాలని, సరైన వారిని ఎంపిక చేసుకోవాలని అధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులను అందుబాటులో ఉంచారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం అందరికి మరింత సులభంగా ఓటు వివరాలు తెలుసుకునేందుకు కొత్త విధానం తీసుకువచ్చింది. ఇసిఐ స్పేస్ ఇచ్చి ఓటరు నంబరుతో 1950 నంబర్‌కు మెసేజ్ పెడితే ఓటరు వివరాలు వస్తాయి.

జిల్లాలకు చేరిన ఎన్నికల సామాగ్రి
పోలింగ్ కోసం ఎన్నికల సామాగ్రిని ఆయా జిల్లాల్లో అధికారులు పంపిణీ చేశారు. పోలింగ్ బూత్‌ల వారీగా, సెక్టార్ల వారీగా విభజించి సామాగ్రిని పంపిణీ కేంద్రాలో పోలింగ్ అధికారులకు అంజేశారు. ఆయా జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు పరిలీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. విధులను నిబద్ధతతో నిర్వహించాలని ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది.
నేడు వేతనంతో కూడిన సెలవు
లోక్‌సభ ఎన్నికలకు సోమవారం(మే 13) అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పోలింగ్ సందర్భంగా అన్ని ఫ్యాక్టరీలు, షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్స్, పరిశ్రమలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు మొత్తం రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.

ఓటర్లు ఎవరికి జై కొడతారో..?
సార్వత్రిక ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 525 మంది, కంటోన్మెంట్‌లో 15 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు ముమ్మర ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఓటర్లు ఎవరికి జై కొడతారో అని అంతర్మథనం చెందుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పోటీ చేస్తున్నాయి. అగ్రనేతలు, ముఖ్యనేతలతో పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగియడంతో స్థానికేతరులు జిల్లాల నుంచి వెళ్లిపోవాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఆఖరి ఘట్టం సోమవారంతో ముగియనున్నది. అభ్యర్థుల భవితవ్యం ఇవిఎం బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. జూన్ 4న ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టారో…ఎవరి ఓడించారో తేలిపోనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News