లబ్ డబ్.. లబ్ డబ్.. లబ్ డబ్. ఇప్పుడు అందరి గుండెలు ఇదే వేగంతో కొట్టుకుంటున్నాయి. దేశ పాలనాపగ్గాలు చేపట్టబోయేదెవరో నేడు కొన్ని గంటల్లో తేలిపోనుంది. పోటెత్తిన ఓటరు ఇవిఎంల్లో తన తీర్పు ఎవరివైపు రాశాడోనన్న ఉత్కంఠకు తెరపడనుంది. వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారంనా ఉదయమే మొదలు కాబోతుండడంతో యావత్ ప్రపంచంతో పాటు భారత్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల భవితవ్యం అటో ఇటో అవగతం కానుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఫలితాలు కూడా ఆయా రాష్ట్రాల ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. క్షణక్షణం ఫలితాల సరళిని తెలుసుకునేందుకు జనం టివిలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోనున్నారు. ముచ్చటగా వరుసగా మూడోసారి హస్తినను హస్తగతం చేసుకోవాలని బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ తహతహలాడుతుండగా..
ఈ సారి ఎలాగైనా కమలం పార్టీకి చెక్ పెట్టాలని ఇండియా కూటమిగా ఏర్పడ్డ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఏ కూటమిలోనూ లేని ప్రాంతీయ శక్తులు హంగ్ సర్కార్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పాలని తహతహలాడుతున్నాయి. ఇలాంటి వ్యూహ ప్రతి వ్యూహాల నడుమ ఓటరు రాసిన తీర్పు ఏంటో గంటల్లో తేలిపోనుంది. ఆ మహాశయుడు ఎవరికి పాలనాపగ్గాలు అందిస్తాడో.. ఎవరిని విపక్షానికి పరిమితం చేస్తాడో స్పష్టం కానుంది. ఇక తెలంగాణలో 17 ఎంపి స్థానాల కోసం ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి తలపడ్డాయి. అధికార కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకొని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించాలని భావిస్తుండగా.. కాషాయ పార్టీ డుబల్ డిజిట్‌పై కన్నేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి చతికిల పడ్డ బిఆర్‌ఎస్ చెప్పుకోదగ్గ స్థానాలు గెలుచుకొని ప్రత్యర్థులకు సవాల్ విసురుతామన్న ధీమాతో ఉంది. ఎగ్జిట్‌పోల్స్ తారుమారవుతాయా..? అటుఇటుగా అవి చెప్పిన ఫలితమే రాబోతుందా..? అన్న ఉత్కంఠకు తెరపడనుంది.