Monday, November 18, 2024

విపక్షాన్ని కలిపిన సమావేశాలు

- Advertisement -
- Advertisement -

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందరి పార్లమెంటు ఆఖరి బడ్జెట్ సమావేశాలు గురువారం నాటితో ముగిసిపోయాయి. ‘అచ్ఛేదిన్’ నినాదం బూజుపట్టిపోడంతో ‘అమృత్ కాల్’ అనే సరికొత్త పంచదార పలుకుతో ఈ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. వచ్చే పాతికేళ్ళ కాలాన్ని అమృత్ కాల్‌గా పరిగణించి విశేష అభివృద్ధిని, ప్రతిఒక్కరి బాగును సాధిస్తామని బిజెపి చెప్పుకొంటున్నది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంలో ప్రధాని మోడీ దీనిని మొదటిసారిగా ఉపయోగించారు. ఈ కాలంలో అభివృద్ధిలో గ్రామాలకు, నగరాలకు గల తేడాను పూడ్చుతామని ఆయన తన ప్రసంగాల్లో పేర్కొన్నారు. అయితే అమృత్ కాల్ బడ్జెట్ సమావేశాలు మాత్రం పాలక, ప్రతిపక్షాలు సృష్టించిన ఎడతెగని గందరగోళ దృశ్యాలలో ముగినిపోయాయి. సభా కార్యక్రమాలు అతి తక్కువ కాలమే జరిగాయి.

చర్చ జరగకుండానే రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్ ఆమోదం జరిగిపోయింది. వాస్తవం చెప్పాలంటే పార్లమెంటు సమావేశాలు ఎటువంటి అడ్డంకీ లేకుండా సవ్యంగా జరిగి ప్రతి ఒక్క క్షణం చర్చకు అంకితం కావాలంటే పాలక పక్షమే అందుకు బాధ్యత వహించాలి.ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు వెలిబుచ్చే సందేహాలకు తగిన సమాధానాలిచ్చి చర్చ ముందుకు సాగేలా చేయవలసింది పాలక పార్టీయే. ఈ విషయంలో బిజెపి వైఫల్యం ఈ సమావేశాల్లో కొట్టవచ్చినట్టు కనిపించింది. సమావేశాలు జరుగుతుండగా బహిర్గతమైన హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రతిపక్షాలు దృష్టి కేంద్రీకరించడాన్ని ఎంత మాత్రం తప్పు పట్టలేము. ప్రధాని మోడీకి సన్నిహిత మిత్రుడైన గుజరాత్ వ్యాపారి గౌతమ్ అదానీని ఐశ్వర్య శిఖరాల నుంచి కిందికి దిగజార్చివేసిన స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని బహిర్గతం చేసిన హిండెన్‌బర్గ్ నివేదిక జనవరి 24న బయటపడింది.

స్వయాన దేశ ప్రధానితో ముడిపడి వున్న వ్యవహారం కావడం వల్ల దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జెపిసి) వేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడం ప్రారంభించింది. జెపిసి నియామకం సంగతి అటుంచి అదానీతో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ఈ అంశంపై ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయడానికి కూడా సిద్ధపడలేదు. ఆయన మౌనం దేశ ప్రజలను కూడా దిగ్భ్రాంతికి గురి చేసి వుండాలి. దానితో సమావేశాలు చివరి రోజున కూడా ప్రతిపక్షం తన పట్టు వీడలేదు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్‌లో మాట్లాడడం పట్ల అభ్యంతరం తెలుపుతూ పాలక బిజెపి కూడా సమావేశాలు స్తంభించిపోడానికి తన వంతు పాత్రను తాను పోషించింది. ఆ విషయమై సభలో మాట్లాడడానికి అవకాశమివ్వాలని రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌ను కోరినా ప్రయోజనం లేకపోయింది. పాలక పక్షమే సభను ముందుకు సాగనీయలేదనేది స్పష్టపడుతున్నది.

అదానీ వ్యవహారంలో ప్రధాని మౌనం ఆయన లోపాన్ని సందేహాతీతంగా రుజువు చేసింది. పార్లమెంటు సమయమంతా గందరగోళ దృశ్యాలకు హరించుకుపోడం ఒక రకంగా బాధాకరమే. అదే సమయంలో పాలక పక్ష మొండితనానికి, నిరంకుశ పోకడకు వ్యతిరేకంగా ప్రతిపక్షం ఒక్క త్రాటిమీద నిలబడి తన కంఠాన్ని వినిపించడానికి ఈ సమావేశాలు వేదికయ్యాయి. ప్రజాస్వామ్యానికి కలిగిన మేలుగానే దానిని పరిగణించాలి. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షాలన్నీ సంఘటితమైన దృశ్యం కళ్ళకు కట్టింది. లోక్‌సభ ఎన్నికలు 12 మాసాల చేరువలో వున్నాయనగా ప్రతిపక్షాలు ఇలా ఏకం కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధ్వాన స్థితిలో వుందని, ఇతర ప్రతిపక్షాలు చెల్లాచెదురై పోయాయని తాను వరుసగా మూడోసారి దేశాధికారం చేపట్టడం సునాయాసమని బిజెపి భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఐక్యమవుతున్న సూచనలు ఇంత స్పష్టంగా కనిపించాయంటే అది ఈ బడ్జెట్ సమావేశాల పుణ్యమేనని అనుకోవలసి వుంది.

అదానీ వ్యవహారం సకాలంలో ప్రతిపక్షాలకు అందివచ్చిన అంశమైంది. రాహుల్ గాంధీ చేసిన ‘మోడీలు దొంగలు’ వ్యాఖ్యపై గుజరాత్ కోర్టు ఆయనకు శిక్ష విధించడం ఆ వెంటనే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించడం బిజెపిలోని భయాలను బయటపెట్టింది. ప్రతిపక్షాలు మోడీని తట్టుకొని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కల్ల అనే స్థితి నుంచి గట్టి పోటీని ఇవ్వగలుగుతాయనే స్థాయికి అవి చేరుకోడం హర్షించవలసిన పరిణామం. ప్రతిపక్ష పార్టీల మీద లేనిపోని ఆరోపణలతో ఇడి, సిబిఐని ఉసిగొల్పి వాటిని బలహీనపరచడంలో అందెవేసిన చేయి అనిపించుకొన్న బిజెపి అదానీ వ్యవహారంలో తిన్న దెబ్బ సాధారణమైనది కాదు. అయితే పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అవకతవక అమలు వంటివి జరిగి నానాకష్టాల పాలు చేసినా తనను వరుసగా రెండోసారి మరింత బలంతో అధికారానికి పంపించిన ప్రజలు మూడోసారి కూడా మోసపోయి గద్దెను ఎక్కించరా అనే ధీమాలో బిజెపి కొనసాగడానికే ఇప్పటికీ ఎక్కువ అవకాశాలున్నాయి. అందుచేత ప్రతిపక్షాలు మరింత జాగ్రత్తగా అడుగులు వేయవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News