ఒకప్పటి బాలీవుడ్ హీరోలకు రాజకీయ పార్టీల్లో గిరాకీ చాలా ఉంది. వెండితెరను వదిలిపెట్టేసిన చాలామంది నటులు రాజకీయ అరంగేట్రం చేసి, రాణించిన సంగతి తెలిసిందే. అమితాబ్, వినోద్ ఖన్నా, శతృఘ్నసిన్హా, రాజ్ బబ్బర్, జయాబచ్చన్ ఇలా రాజకీయాల్లోకి వచ్చినవారే. వీరిలో చాలాకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నవారిలో శతృఘ్నసిన్హా, జయాబచ్చన్ గురించి చెప్పుకోవచ్చు.
పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ నియోజకవర్గానికి తృణమూల్ పార్టీ శతృఘ్న సిన్హా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లోనూ అసన్ సోల్ నుంచి ఆయనకే టిక్కెట్ ఇస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా స్పష్టం చేశారు. దీంతో అసన్ సోల్ నుంచి బిజేపి తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. 2022 ఉప ఎన్నికలలో అసన్ సోల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పై శతృఘ్న సిన్హా దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో బిజేపి టికెట్ పై ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియో గెలిచి, కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 2019 ఎన్నికల్లో ప్రముఖ నటి మూన్ మూన్ సేన్ (తృణమూల్)పై బాబుల్ సుప్రియో గెలిచినా, ఆ తర్వాత ఆయన ఎంపీ సీటుకు రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర కేబినెట్ లో మంత్రి అయ్యారు.
అసన్ సోల్ నుంచి శతృఘ్న సిన్హాకు టికెట్ కన్ ఫర్మ్ కావడంతో బిజెపి నాయకత్వం అప్రమత్తమైంది. ఈసారి శతృఘ్నపై బలమైన అభ్యర్ధిని నిలబెట్టేందుకు అన్వేషణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని పోటీకి నిలబెడితే ఎలా ఉంటుందని బిజెపి వర్గాలు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. అదే జరిగితే ఒకే నియోజకవర్గం నుంచి ఒకప్పటి ఇద్దరు బాలీవుడ్ అగ్ర నటులు ఢీకొనక తప్పదన్నమాటే.