Monday, December 23, 2024

గేట్లెత్తేశాం.. మాటలే మేనిఫెస్టో!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఈసారి పార్లమెంటు ఎన్నికల హడావుడి ఉండాల్సన స్థాయి కన్నా తక్కువ ఉందేమో! 2018, 2019 సంవత్సరాల్లో ఈ చాలా రకాలుగా కనిపించింది. ఈసారి ఆ తేడా మరింతగా ఉన్నట్టుగా ఉంది. హైదరాబాదులోనే ఇలా ఉంటే మండే ఎండల మధ్య పల్లె సీమల్లో ఇంకెలా ఉంటుందో? కేవలం మాటలే మేనిఫెస్టోగా నడుస్తోంది తెలంగాణ రాజకీయ సరళి.పైపెచ్చు కాంగ్రెస్ గెలుస్తుందని 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తుండగానే తెలంగాణలో మీడియా కొత్తగా స్వేచ్ఛ వచ్చినట్లు ప్రవర్తించింది. సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కవిత అరెస్టు కారణంగా బిఆర్‌ఎస్ కుదేలైపోయిందనిపిస్తోంది.

టికెట్ల కోసం బారులు తీరకపోవడమే దీనికి నిదర్శనం. తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారం మరోలా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే అంతర్గత పోరాటాలు మొదలై, వినోదం కలిగిస్తాయని కొంత మంది వాంఛించారు. అలా కాకుండా సాధ్యమైనంత లో కేబినెట్ బృందం సజావుగానే సాగుతోంది.ఇది సగటు కాంగ్రెస్ పోకడకు దూరమైన సంగతే. అదే సమయంలో ఇచ్చిన హామీలను తీర్చేందుకు సతమతమవుతోందనే అభిప్రాయం కలిగింది. అయితే కాంగ్రెస్ పూర్తిగా కుదురుకోకుండానే టిఆర్‌ఎస్ తీవ్రంగా దాడి మొదలు పెట్టడంతో రాజకీయం నడక పరుగులెత్తింది. తాము ఏమాత్రం ఊహించని రీతిలో పరాజయం మీదబడటంతో చలించిన కెటిఆర్, హరీశ్‌రావు ద్వయం ఇలాంటి వైఖరి తీసుకున్నారని భావించాలి. ఏ కారణమైనా ఆరు నెలల్లో పడిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది.

ఇది పదేళ్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయం లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం. దాంతో తెలంగాణ మూడు పార్టీల నాయకులు మాటల యుద్ధానికి గేట్లెత్తారు. ఫిరాయింపులకు గేట్లెత్తేశామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి మాటల రభసకు సైరన్ మ్రోగించారు. దాంతో గుంటనక్కలే కాదు సింహాలు కూడా జూలు విదిల్చి వచ్చేస్తాయని మూడు పార్టీల నాయకులు ధ్వనించారు. రేవంత్ రెడ్డికి మరో రెడ్డి జవాబు చెప్పాలనేమో బండి, ఈటల, రఘునందన్ కాకుండా మహేశ్వర రెడ్డి బిజెపి నుంచి మాట్లాడటం మొదలుపెట్టారు. నిజానికి తెలంగాణ రాజకీయ దృశ్యం వంటిది భారతదేశంలో మరొక చోట దొరకదేమో! సమఉజ్జిల్లాగా అనిపించే మూడు పార్టీలు గత పదేళ్లుగా ఒకే రకమైన మాటలు మాట్లాడుతూ, ఒకే రకమైన ఖండనలు చేస్తూ సాగుతున్నాయి. ప్రతి పార్టీ మిగతా రెండింటినీ టార్గెట్ చేస్తూ ఒకదానికొకటి బి టీములని తూలనాడుతున్నాయి.

విషయం ఏదైనా వాదన మాత్రం అలాగే ఉంటుంది. టచ్‌లో ఉన్నారంటూ బిఆర్‌ఎస్ నాయకులు ధ్వనిస్తే, కాంగ్రెస్ అధ్యక్షుడుగా గేట్లు తీస్తామని జవాబు. దానికీ బిజెపి రెండింటిలో తమకు ఆసక్తి, ప్రవేశం ఉన్నట్లు కొనసాగింపు. గేట్లు రంగప్రవేశం చేశాక పడగొట్టడం తగ్గుమొహం పట్టింది. కానీ, ఫిరాయింపుదారులకు రాచబాట లేర్పడ్డాయి. ఇది ఎన్నికల నోటిఫికేషన్ మొదలయ్యే దాకా సాగొచ్చు. కెటిఆర్, హరీశ్ మాత్రమే తొలుత మాటల చిచ్చుబుడ్లు పేల్చారు, కవిత కటకటాల పాలైనా కెసిఆర్ ఉలకలేదు, పలకలేదు. అయితే పెద్ద సారు ఆలస్యంగా వాయింపుడు ప్రారంభించినా డెసీ బెల్స్ బద్దలై మీడియా, సోషల్ మీడియా ఏకకాలంలో పేలిపోయాయి. కరోనా కాలం నుంచి కెసిఆర్ ప్రసంగాలకు మరింత గ్లామర్ పెరిగిపోయి మీడియా రేటింగ్స్ అదిరిపోయేవి, చంద్రబాబు మీద విసుర్లతో సహా! ఇప్పుడు కూడా ఎందుకు ప్రవేశించిందో కానీ నిరోధంతో కూడిన రీతిలో వచోవైభవం.

మరి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి తుక్కుగూడ కాంగ్రెస్ మీటింగ్‌లో అంతకు ముందు ప్రణాళికేమిటో తెలియదు కానీ, కెసిఆర్‌పై చెలరేగి ఊగిపోయి శివతాండవం చేసేశారు! దాంతో యూట్యూబ్ వీడియోల నర్తనం హొయలు పోయింది. నిజానికి కెటిఆర్ స్పందించారు కానీ బాగా ఆలస్యంగా! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మేడిగడ్డ వ్యవహారం, టెలిఫోన్ ట్యాపింగ్ మసాలా, ఎండిపోయిన తెలంగాణ పంటలు లేదా ముందు ముందు మీదబడే ఏ విషయమైనా ఈ వచో కాలుష్యంలో మునిగి తేలాల్సిందేనా? కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కుదుటపడే టైమివ్వక బిఆర్‌ఎస్ పోరు మొదలు పెట్టి తొందరపడిందా? కాంగ్రెస్ ఈస్థాయిలో గతంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మీద ఎందుకు విమర్శల దాడి చేయలేకపోయింది? తమ పార్టీ పట్ల కనీసం సానుభూతిని కూడా రాకుండా, దాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసుకొన్న కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌ల విమర్శల వెల్లువ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను కలిపి ఉంచుతోందా? ఈ మూడు పార్టీల ముచ్చటైన ఆటలో బిజెపి బాపుకునేదేమిటి? మరి ఈ మొత్తం రచ్చరచ్చ గోలలో సగటు తెలంగాణ పౌరుడికి ఒనగూడేదేమిటి? నిజానికి పౌరసమాజం ఈదిశలో దృష్టి పెట్టి కృషి చేసి మార్గనిర్దేశం చేయాల్సిన అగత్యం ఉంది.

అయితే దౌర్భాగ్యవశాత్తు ఆలోచనపరులు సైతం రాజకీయ పార్టీలు ఏ కారణంతో అయితే ఉచ్చులో పడ్డాయో దాదాపు అలాంటి నేపథ్యంతోనే మిగతా ఉన్నత వర్గాలు సతమతమైపోవడం బాధాకరం. కనుకనే ఈ నిష్క్రియాపరత్వం వెలి వేరుస్తూనే ఉంది.అవసరం లేని నినాదాల, నిందల పర్వాలు అనంతంగా కొనసాగడం.దీనికి ఒక పరిష్కారం తప్పక రావాలి, అయితే ఎలా?పార్టీలు పార్టీలతో సంబంధం ఉన్న మీడియాతో ఎటువంటి బాధరాయణ సంబంధం లేకుండా పౌరసమాజం నడుం కట్టాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇలాంటి ప్రయత్నం కర్ణాటక రాష్ట్రంలో పదేళ్ల క్రితం కొంత స్థాయిలో జరిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి!

డా నాగసూరి వేణుగోపాల్ 9440732392

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News